ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా సమస్యల స్వీకరణ కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
పురందరేశ్వరి మాట్లాడుతూ బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తారని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రోజుకొక ప్రజాప్రతినిధి ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ సమస్యలను క్రోడీకరించి సంబంధిత ప్రభుత్వ విభాగానికి పంపించేందుకు ఏర్పాటు చేసారు. దానికోసం ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన వెబ్సైట్ను పురందరేశ్వరి ప్రారంభించారు.
ఆ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్, వారధి సమన్వయకర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి జాతీయ పతాకాన్ని ఎగురవేసారు.