భారతదేశపు రక్షణ రంగ ఎగుమతులు అసాధారణ స్థాయిలో పెరుగుదల నమోదుచేసాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. అంతకుముందరి ఆర్థిక సంవత్సరంలో మన రక్షణ ఎగుమతుల విలువ రూ. 15,920 కోట్లు. అంటే ఒక్క యేడాదిలోనే 32.5శాతం ఎగుమతులు పెరిగాయి. దశాబ్దకాలం క్రితంతో, అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు రక్షణ ఎగుమతుల విలువ 31రెట్లు పెరిగింది. ఈమధ్య కాలంలో భారతదేశం రక్షణ రంగ ఎగుమతులు నిలకడగా, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ప్రధానంగా సీషెల్స్, మాల్దీవులు, మారిషస్, ఈక్వెడార్ దేశాలకు ఈ ఎగుమతులు చేస్తున్నాం.
భారత రక్షణరంగంలో కొత్తశకం:
ఈ అద్భుతమైన ఫలితాలు దేశీయ రక్షణ పరిశ్రమ విశేష కృషికి నిదర్శనం అని రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది. భారత రక్షణ పరిశ్రమలో ప్రైవేటు రంగం, డిఫెన్స్ ప్రభుత్వరంగ సంస్థలు రెండింటి కృషీ ఉంది. రక్షణ ఎగుమతుల్లో ప్రైవేటు రంగం వాటా 60శాతం ఉండగా, డిపిఎస్‌యుల వాటా 40శాతం ఉంది. తద్వారా ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య సమతూకం సాధించారు. ఇక, ఎగుమతి అనుమతుల (ఎక్స్‌పోర్ట్ ఆదరైజేషన్లు) సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అనుమతుల సంఖ్య 2022-23లో 1,414 నుంచి 2023-24లో 1,507కు పెరిగింది. అంటే భారతదేశపు రక్షణరంగ ఎగుమతుల సామర్థ్యం భారీగా విస్తరిస్తోందన్నమాట.
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల రక్షణ ఎగుమతుల విస్తృతి చాలాపెద్దగా ఉంది. డోర్నియే-228 వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆర్టిలరీ గన్స్, బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్లు, లాంచర్లు, రాడార్లు, సిమ్యులేటర్లు, సాయుధ వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. మనం దేశీయంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తుల మీద కూడా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటోంది. తేజస్ తేలికపాటి యుద్ధవిమానాలు, తేలికపాటి హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను కొనుగోలు చేయడానికి పలుదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాదు, నిర్వహణ, రిపేర్లు, ఓవర్‌హాలింగ్ విభాగాల్లోనూ భారతదేశపు సంస్థల సమర్ధత అంతర్జాతీయ క్లయింట్లను ఆకర్షిస్తోంది.
రక్షణ ఎగుమతుల్లో ప్రైవేటు రంగంలో సుమారు 50 కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇటలీ, మాల్దీవులు, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్, నేపాల్, మారిషస్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, పోలండ్, స్పెయిన్, చిలీ వంటి దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. రక్షణరంగ ఎగుమతుల్లో ప్రధానంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఆఫ్‌షోర్ పేట్రోలింగ్ నౌకలు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, సుఖోయ్ విమానాలు, కమ్యూనికేషన్ పరికరాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, కవచ్ లాంచర్లు, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, రాడార్ స్పేర్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, తేలికపాటి ఇంజనీరింగ్ మెకానికల్ విడిభాగాలూ ఎగుమతి చేస్తున్నాం. నౌకల మీద క్షిపణి దాడులను నిలువరించే ఇంటలిజెంట్ డెకాయ్ సిస్టమ్స్ కూడా భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
రక్షణరంగ ఎగుమతుల్లో గణనీయమైన ఈ అభివృద్ధి కేవలం గణాంకాల్లో పెరుగుదల మాత్రమే కాదు. విధానపరమైన ఎన్నో సంస్కరణలను అమలుచేసిన తుదిఫలితం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సులభతర వాణిజ్య విధానాలను ఆచరణలోకి తీసుకువచ్చిన ఫలితమిది. రక్షణరంగం కోసం ప్రత్యేకంగా ఆవిష్కరించిన సమగ్ర డిజిటల్ పరిష్కారాలతో కలిసి ఈ సంస్కరణలు భారత రక్షణరంగ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా నిలబెట్టాయి, అక్కడ విజయాలు సాధించి మన విపణి అవకాశాలను విస్తృతపరిచాయి. 2004-05 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకూ పదేళ్ళ వ్యవధిలో మన దేశపు మొత్తం రక్షణ ఎగుమతుల విలువ 4వేల 3వందల 12కోట్ల రూపాయలు. తర్వాతి పదేళ్ళలో అంటే 2014-15నుంచి 2023-24 వ్యవధిలో ఆ విలువ 21రెట్లు పెరిగి, 88వేల 3వందల 19కోట్లకు చేరుకుంది. ఆ విషయాన్ని స్వయంగా రక్షణశాఖే వెల్లడించింది. అలాగే రక్షణ ఉత్పత్తుల విలువ 2014లో 40వేల కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం లక్షా 10వేల కోట్ల రూపాయల స్థాయి దాటిపోయిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
గొప్ప లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు:
ఈ యేడాది ప్రారంభంలో రక్షణ రంగానికి సంబంధించిన ఒక సదస్సులో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశీయ రక్షణ రంగానికి సమున్నతమైన లక్ష్యాలు నిర్దేశించారు. ఆయన అంచనా ప్రకారం మన దేశపు వార్షిక రక్షణ ఉత్పత్తుల విలువ 2028-29 నాటికి 3లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది, రక్షణ రంగ ఎగుమతుల విలువ 50వేల కోట్ల రూపాయలు దాటుతుంది. మన దేశం వచ్చే ఐదేళ్ళలో ఏరో ఇంజిన్స్, గ్యాస్ టర్బైన్లు, ఇతర అత్యున్నత సాంకేతిక వ్యవస్థలను సొంతంగా తయారుచేసుకోగల సామర్థ్యాన్ని అందుకుంటుందని, తద్వారా రక్షణ రంగ సాంకేతికతలో మన దేశపు స్వయంసమృద్ధి మరింత బలోపేతం అవుతుందని రాజ్‌నాధ్‌సింగ్ వివరించారు.
ప్రపంచంలో భారత్ స్థాయి ఎక్కడ? మన ముందున్న సవాళ్ళేమిటి?:
రక్షణ ఎగుమతుల్లో అభివృద్ధి చాలా బాగున్నమాట నిజమే అయినప్పటికీ, భారతదేశం ఇంకా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగానే ఉంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 అంటే ఐదేళ్ళ వ్యవధిలో ప్రపంచవ్యాప్త ఆయుధాల దిగుమతుల్లో 9.8శాతం వాటా మన దేశానిదే. 2014 నుంచి 2018 వ్యవధితో పోలిస్తే ఇప్పుడు భారతదేశం ఆయుధాల దిగుమతులు 4.7శాతం పెరిగాయి. చైనా, పాకిస్తాన్ మన దేశంతో ఘర్షణలు కొనసాగిస్తున్న కారణంగా ఆయుధాలు దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అవసరంగా మిగిలింది.
మనదేశానికి పెద్దయెత్తున ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంగా ఇంకా రష్యాయే ఉంది. భారతదేశపు ఆయుధ దిగుమతుల్లో 36శాతం రష్యా నుంచే వస్తాయి. నిజానికి 2009-13 వ్యవధితో పోలిస్తే ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు సగానికి పైగా తగ్గాయి. అప్పట్లో రష్యా నుంచి 76శాతం దిగుమతులు ఉండేవి. ఇప్పుడు భారతదేశం మిలటరీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను దేశీయ సరఫరాదారుల నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి కూడా స్వీకరిస్తోంది. భారత్‌కు ఆయుధాల సరఫరాలో రష్యా తర్వాత స్థానంలో ఫ్రాన్స్ ఉంది. భారత దిగుమతుల్లో ఫ్రాన్స్ వాటా 33శాతం ఉంది. 13శాతం సరఫరాతో అమెరికా మూడోస్థానంలో నిలిచింది.
2018-22 వ్యవధిలో భారతదేశపు ఆయుధాల దిగుమతులు ప్రపంచవ్యాప్త ఆయుధ అమ్మకాల్లో 11శాతంగా ఉన్నాయి. 2019-23 వ్యవధిలో అది కొంచెం తగ్గి 9.8శాతంగా నమోదయింది.
ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో మొదటి పది స్థానాలను చూస్తే.. అగ్రస్థానంలో భారతదేశం ఉంది. తర్వాత సౌదీ అరేబియా, కతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్, జపాన్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, చైనా ఉన్నాయి. వాటిలో మొదటి ఐదు దేశాలూ కలిపి 2019-23 వ్యవధిలో చేసుకున్న ఆయుధ దిగుమతులు 35 శాతం ఉన్నాయి. ఇక ఆ వ్యవధిలో భారతదేశం రష్యాతో పాటు పాశ్చాత్య సరఫరాదారులైన ఫ్రాన్స్, అమెరికాల నుంచి కూడా దిగుమతులు చేసుకుంది. అదే సమయంలో సైనిక అవసరాల కోసం దేశీయ ఆయుధ పరిశ్రమలను కూడా భారత్ గణనీయంగా ప్రోత్సహించింది.
స్వయంసమృద్ధి దిశగా అడుగులు:
గత పదేళ్ళుగా దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం స్వయంసమృద్ధి లేక ఆత్మనిర్భరత మీద ఎక్కువ దృష్టి సారించింది. ప్రతీ రంగంలోనూ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. రక్షణరంగంలో కూడా అటువంటి ఆత్మనిర్భరత దిశగా కృషి కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో రక్షణశాఖ ఇటీవల సాధించిన ఘనతలు, రక్షణ ఎగుమతుల్లో ఏటికేటా పెరుగుదల నమోదవుతుండడం ఆ ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనం. ఎగుమతులకు అనుమతుల్లో వృద్ధి, ఉత్పత్తి సామర్థ్యంలో పెరుగుదల అనే అంశాలు భారత రక్షణ పరిశ్రమలో వేగవంతమైన అభివృద్ధికి సంకేతాలుగా నిలిచాయి.
అత్యాధునిక రక్షణ పరికరాల ఉత్పాదక రంగంలో మరిన్ని గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని, ఆ విభాగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలనీ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అది సాకారమయ్యే క్రమంలో ఆ రంగంలో ఎదుగుదల మరింత వేగం పుంజుకుంటుంది. పరిశ్రమకు అనుకూలమైన విధాన ప్రక్రియను ఏర్పాటు చేయడం, కొత్త ఆవిష్కరణలకు అండగా నిలవడం, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహించడం… వంటి విధానాలతో భారత్ అంతర్జాతీయ రక్షణరంగ విపణిలో తన స్థానాన్ని శరవేగంగా మెరుగుపరచుకుంటోంది. ముఖ్యంగా ఆత్మనిర్భరత లేదా స్వయంసమృద్ధి సాధించడం మీద ఎక్కువ శ్రద్ధ వహించడం వల్ల రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రపంచస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఆ దిశలో సాధిస్తున్న అభివృద్ధికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాణిజ్య పురోగతి మన కళ్ళముందరి నిదర్శనం. రక్షణ ఉత్పాదక రంగంలో, రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో మన దేశ భవిష్యత్తు ఆశాజనకంగా మాత్రమే కాదు, గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఎదుగుతోంది.