భారతదేశానికి స్వతంత్రం సాధించడం కోసం జరిగిన పోరాటం గురించిన చర్చ వచ్చినప్పుడు, దేశానికి స్వాతంత్ర్యం తామే తెచ్చిపెట్టామని, స్వతంత్ర సమరంపై పూర్తి హక్కులు తమవేననీ భావించే కొన్ని వర్గాలు ఒక మోసపూరిత ప్రశ్న వేస్తూంటారు. ‘‘స్వాతంత్ర్య సంగ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర ఏముంది?’’ అని వారు అడుగుతూ ఉంటారు. జాతీయతావాదాన్ని నిలబెట్టడంలోనూ, దేశ సంస్కృతిని పరిరక్షించడంలోనూ ఆర్ఎస్ఎస్ చేసిన కృషిని కొట్టిపారేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో నిరాధార ఆరోపణలు, తప్పుడు వ్యాఖ్యానాలూ ప్రచారం చేస్తారు. ఆ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ వైద్య పంచుకున్న జ్ఞాపకాలు స్వతంత్ర సంగ్రామంలో సంఘ్ పాత్ర గురించి విలువైన విషయాలను వెల్లడిస్తాయి. ఆయన ఏం చెప్పారో చూద్దాం…
కొంతకాలం క్రితం నాదగ్గరకు ఒక పాత్రికేయుడు వచ్చారు. స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటని ప్రశ్నించాడు. బహుశా అతను కూడా సంఘం గురించిన తప్పుడు ప్రచారాన్ని మాత్రమే విని ఉంటాడు. అతని ప్రశ్నకు నేను ‘స్వతంత్ర సంగ్రామంలో నువ్వు ఎవరిని విశ్వసిస్తావు’ అని ఎదురుప్రశ్న వేసాను. దానికతను సిద్ధంగా లేడు. కొంతసేపు అతనేమీ చెప్పలేకపోయాడు. మెల్లగా, అనుమానాస్పద స్వరంతో ‘మహాత్మా గాంధీ’ అని జవాబిచ్చాడు. అప్పుడు నేను మరో ప్రశ్న వేసాను. ‘ఆ పోరాటంలో లాల్, బాల్, పాల్ త్రయం పాత్ర ఏమీ లేదా? సుభాష్ చంద్రబోస్ పాత్ర ఏమీ లేదా?’ అని అడిగాను. అతను మౌనంగా ఉండిపోయాడు.
గాంధీ నాయకత్వంలో ఎన్ని ‘సత్యాగ్రహాలు’ జరిగాయి అని అడిగాను. అతనికి ఆ ప్రశ్నకు జవాబు తెలియదు. మూడు సత్యాగ్రహాలు జరిగాయి. 1921, 1930, 1942లో అని చెప్పాను. ఆ విషయం తనకు తెలియదని అతను అంగీకరించాడు. 1921, 1930ల్లో జరిగిన రెండు సత్యాగ్రహాల్లోనూ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పాల్గొన్నారని, ఆ రెండుసార్లూ ఆయన జైలుశిక్ష కూడా అనుభవించారనీ వివరించాను. ఆయన 1940లో మరణించినందున ఆ తర్వాత జరిగిన మూడో సత్యాగ్రహంలో పాల్గొనలేకపోయారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చరిత్రను సగంసగం చెప్పే ప్రయత్నాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి.
భారతదేశానికి స్వాతంత్ర్యం కాంగ్రెస్ వల్ల మాత్రమే, 1942 సత్యాగ్రహం వల్ల మాత్రమే వచ్చిందని ప్రజలను నమ్మిస్తున్నారు. వారు తప్ప ఇంకెవరూ ఏమీ చేయలేదని నమ్మబలుకుతున్నారు. అది పూర్తి నిజం కాదు. సత్యాగ్రహం, చరఖా, ఖాదీ ద్వారా గాంధీ స్వాతంత్ర్య సంగ్రామంలో సామాన్య ప్రజలు సైతం పాల్గొనడానికి సులువైన, సరళమైన దారి ఏర్పరిచారు. దానివల్ల స్వతంత్ర పోరాటంలో లక్షలాది ప్రజలు చేరగలిగారన్న మాట నిజం. కానీ మొత్తం ఘనత అంతటినీ ఒకేఒక ఉద్యమానికో, ఒకేఒక పార్టీకో కట్టబెట్టడం అంటే చారిత్రక వాస్తవాలతో ఆడుకోవడం, ఇతరులు చేసిన ప్రయత్నాలను అవమానించడమే అవుతుంది.
ఇంక సంఘం గురించి మాట్లాడుకోవాలంటే, డాక్టర్ హెడ్గేవార్‌జీతో మొదలుపెట్టాలి. కేశవ హెడ్గేవార్ 1889లో జన్మించారు. నాగపూర్‌లో స్వతంత్ర ఉద్యమం గురించిన చర్చలు 1904-05 సమయంలో మొదలయ్యాయి. అంతకుముందు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామం చేయాలన్న వాతావరణం పెద్దగా లేదు. అయినప్పటికీ, 1897లో, క్వీన్ విక్టోరియా సింహాసనం అధిరోహించిన వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో మిఠాయిలు పంచిపెడితే అప్పటికి ఎనిమిదేళ్ళ వయసున్న బాల హెడ్గేవార్ ఆ మిఠాయిలను చెత్తలో విసిరేసాడు. తెల్లవారికి బానిసలుగా ఉండడంపై అతని కోపం, అసహనాలకు నిదర్శనం ఆ ఉదంతం.
1907లో ‘వందేమాతరం’ అన్న మాటను బహిరంగంగా పలకకూడదు అని రిస్లే అనే తెల్లదొర నిషేధ ఉత్తర్వులు జారీ చేసాడు. దానికి వ్యతిరేకంగా కేశవ్ హెడ్గేవార్, నీల్ సిటీ స్కూల్‌లో తన తరగతిలోని విద్యార్ధులందరి చేతా ప్రభుత్వ ఇనస్పెక్టర్ సమక్షంలో ‘వందేమాతరం’ నినాదాలు చేయించాడు. దానికి ఆగ్రహించిన పాఠశాల యాజమాన్యం శిక్షగా అతన్ని బడినుంచి తొలగించేసింది. తర్వాత హెడ్గేవార్ వైద్యవిద్య అభ్యసించడం కోసం కలకత్తా వెళ్ళాడు. బొంబాయిలో వైద్యవిద్య కోసం అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ, విప్లవకారుల కేంద్రం అన్న కారణంతో అతను కలకత్తాను ఎంచుకున్నాడు. అక్కడ అతను విప్లవకారులకు ప్రధానకేంద్రం అయిన ‘అనుశీలన సమితి’లో సభ్యుడిగా చేరాడు.
1916లో హెడ్గేవార్ వైద్యుడిగా నాగపూర్ తిరిగి వచ్చాడు. అప్పట్లో స్వతంత్రోద్యమంలో ప్రముఖ నాయకులందరూ పెళ్ళిళ్ళు అయి కుటుంబ బాధ్యతలు మోస్తున్నవారే. వారందరికీ కుటుంబం కోసం సంపాదించాల్సిన అవసరమూ, ఏదో ఒక ఆదాయమార్గమూ ఉండేవి. అలా కుటుంబ బాధ్యతలు వహిస్తూనే స్వతంత్ర పోరాటం కోసం పనిచేసేవారు. హెడ్గేవార్ కూడా అలాగే చేసి ఉండవచ్చు. అతని కుటుంబం కూడా పెళ్ళి చేసుకోవాలంటూ అతన్ని పదేపదే అడిగేవారు. అయినప్పటికీ హెడ్గేవార్ వైద్యవృత్తి చేపట్టకూడదనీ, పెళ్లి చేసుకోకూడదనీ నిశ్చయించుకున్నాడు. ఆయన భావాల తీవ్రత ఎంతగా ఉండేదంటే తన వ్యక్తిగత జీవితం గురించి ఒక్కక్షణమైనా ఆలోచించకుండా ఆయన తన శక్తియుక్తులనూ, సమయాన్నీ సామర్థ్యాన్నీ దేశం కోసం అంకితం చేసారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగే ప్రతీ ఉద్యమంలోనూ పాలుపంచుకున్నారు.
హెడ్గేవార్‌కు లోకమాన్య తిలక్‌పై ప్రగాఢ విశ్వాసం ఉంది. 1920లో కాంగ్రెస్ సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి. దానికి తిలక్ నాయకత్వం వహించారు. ఆ సమావేశాలకు ఏర్పాట్లు చేయవలసిన బాధ్యతను తిలక్, డాక్టర్ హర్దీకర్, డాక్టర్ హెడ్గేవార్‌లకు అప్పగించారు. వారు ఆ పనికి 1200మంది కార్యకర్తలను తీసుకొచ్చారు. అప్పట్లో హెడ్గేవార్ కాంగ్రెస్ నాగపూర్ నగర విభాగానికి సంయుక్త కార్యదర్శిగా ఉండేవారు. ఆ సమావేశాల సందర్భంలో కాంగ్రెస్ తీర్మానాల ముందు హెడ్గేవార్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘భారతదేశాన్ని సంపూర్ణ స్వతంత్ర దేశంగా చేయాలి, పెట్టుబడిదారీ విధానపు సంకెళ్ళ నుంచి విముక్తం చేయాలి, భారతీయ గణతంత్ర రాజ్యాన్ని స్థాపించాలి’ అన్నది హెడ్గేవార్ చేసిన ప్రతిపాదన.
సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం హెడ్గేవార్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ ఆ సమావేశాల్లో పరిగణనలోకి తీసుకోలేదు కానీ తొమ్మిదేళ్ళ తర్వాత అంటే 1929లో లాహోర్ర సమావేశాల్లో ఆ ప్రతిపాదనను ఆమోదించింది. దానికి ఎంతగానో సంతోషించిన డాక్టర్జీ, 1930 జనవరి 26 నాటి అన్ని సంఘ శాఖలలోనూ కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు చెప్పాలని సందేశమిచ్చారు. (సంఘం పని 1925లో మొదలైంది). ఆ రోజుల్లో నాగపూర్ నగరం, తిలక్ అనుయాయుల కార్యక్షేత్రంగా ఉండేది. 1920 ఆగస్టు 1న లోకమాన్య తిలక్ మరణంతో నాగపూర్‌లోని తిలక్ అనుయాయులందరూ నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమాన్ని మహాత్మా గాంధీ నేతృత్వంలో మొదలుపెట్టింది.
1921లో సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమానికి సామాజిక పునాదిని విస్తరింపజేయడం కోసం మహాత్మాగాంధీ ముస్లిములను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు పలికాడు. టర్కీలో ఖిలాఫత్‌ను బ్రిటిష్ పాలకులు రద్దు చేయడంతో గాయపడిన ముస్లిములను, బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలోకి ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. పలువురు కాంగ్రెస్ నాయకులు, జాతీయవాద ముస్లిములు దానికి అభ్యంతరం వ్యక్తం చేసారు. కాబట్టి నాగపూర్‌లో సహాయ నిరాకరణ ఉద్యమం అంతగా ప్రభావం చూపలేకపోయింది.
కానీ డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ చోల్కర్, సమీముల్లాఖాన్ తదితరులు ఆ వాతావరణాన్ని మార్చేసారు. జాతీయ ఉద్యమాన్ని ఖిలాఫత్‌తో ముడిపెట్టడాన్ని హెడ్గేవార్ ఒప్పుకోకపోయినా, తన అభిప్రాయాన్ని ఆయన బహిరంగ పరచలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో హృదయపూర్వకంగా పాల్గొన్నాడు. ఆయన వ్యక్తిగత సామాజిక బంధాలకు దూరంగా ఉండి, అప్పటి జాతీయ పరిస్థితులను విశ్లేషించాడు. నాగపూర్‌లో తిలక్ అనుచరుల ధోరణి, చుట్టుపక్కల ఉన్న రాజకీయ వాతావరణం గురించి ఆయన ఎంతమాత్రం ఆందోళన చెందలేదు.
హెడ్గేవార్ ఏడాదిపాటు జైలుశిక్ష అనుభవించారు. 1921 ఆగస్టు 19 నుంచి 1922 జులై 11 వరకూ ఆయనను తెల్లదొరతనం ఖైదు చేసింది. విడుదల తర్వాత ఆయన గౌరవార్థం నాగపూర్‌లో 12 జులై నాడు బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయ, స్థానిక నాయకులు హకీం అజ్మల్ ఖాన్, పండిట్ మోతీలాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, డాక్టర్ అన్సారీ, విఠల్‌భాయ్ పటేల్, తదితరులు డాక్టర్ హెడ్గేవార్‌కు స్వాగతం పలికారు.
స్వాతంత్ర్యం సాధించవలసిన ఆవశ్యకత, ప్రాధాన్యతను అర్ధం చేసుకున్నప్పటికీ, డాక్టర్ హెడ్గేవార్ మనసును ఒక ప్రశ్న నిరంతరాయంగా తొలుస్తూనే ఉంది. భారతదేశానికి వ్యాపారం చేయడానికి ఏడువేల మైళ్ళ ఆవలినుంచి వచ్చిన గుప్పెడుమంది బ్రిటిషర్లు ఇంత సువిశాల దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకుని పరిపాలిస్తున్నారు? అంటే తప్పకుండా మనలో కొన్ని లోపాలున్నాయన్న మాట. మన సమాజం ఎన్నో విభాగాలుగా విడిపోయి ఉంది. స్వీయ అస్తిత్వాన్ని మరచిపోయే లక్షణం, కులాలు-ప్రాంతాలు-భాషల వారీగా సమాజం విడిపోయి ఉండడం, దేశం అవ్యవస్థీకృతంగా ఉండడం, ఎన్నో దురాచారాలు ఉన్నాయి. వాటివల్ల ఐక్యత లోపించిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుని, బ్రిటిష్‌వారు మన దేశంపై పెత్తనం సాధించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన సమాజం అలాగే మిగిలిపోతే, చరిత్ర పునరావృతమవుతుందని హెడ్గేవార్‌కు అర్ధమైంది. ‘నాగనాథుడు పోయాడు, సర్పనాథుడు వస్తాడు’ అని ఆయన అంటుండేవారు. అందుకే ఈ దేశ సమాజాన్ని ముందు దాని దోషాల నుంచి విముక్తం చేయడం తప్పనిసరి అని… ఆత్మగౌరవం, జాగరూకత, వ్యవస్థీకరణ, జాతీయ గుణాల వంటి లక్షణాలతో నింపాలనీ ఆయన భావించారు. ఆ కార్యం రాజకీయాలకు అతీతంగా, కీర్తికాంక్షకు దూరంగా, మౌనంగా, నిరంతరాయంగా జరగాల్సిన పని.
సంఘాన్ని స్థాపించిన తర్వాత కూడా రాజకీయ సామాజిక నాయకులతోనూ, ఉద్యమాలూ కార్యకలాపాలతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు యథావిధిగా కొనసాగాయి. 1930లో గాంధా పిలుపు మేరకు గుజరాత్‌లోని దండిలో ఉప్పు సత్యాగ్రహం రూపంలో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. 1929 నవంబర్‌లో సంఘచాలక్‌ల మూడురోజుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో, సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ బేషరతుగా మద్దతుగా నిలుస్తుందని నిర్ణయం తీసుకున్నారు.
సంఘం విధానం ప్రకారం హెడ్గేవార్ తాను, ఇతర సంఘసేవకులూ వ్యక్తిగత స్థాయిలో ఆ సత్యాగ్రహంలో పాల్గొనాలని నిర్ణయించారు. అదే సమయంలో సంఘం పని నిరంతరాయంగా కొనసాగడానికి ఆయన సర్‌సంఘచాలక్ బాధ్యతను తన స్నేహితుడు డాక్టర్ పరాంజపేకు అప్పగించారు. శాఖల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పనిని బాబాసాహెబ్ ఆప్టే, బాపూరావు భేడీలకు అప్పగించారు. జులై 21న హెడ్గేవార్‌తో పాటు సత్యాగ్రహంలో సుమారు 4వేలమంది పాల్గొన్నారు. నాగపూర్ నుంచి వార్ధా, యావత్మాల్ మీదుగా పూసాడ్ చేరుకునేసరికి సత్యాగ్రహ స్థలం దగ్గర 10వేల మంది కూడారు. ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు హెడ్గేవార్ 9 నెలల జైలుశిక్ష అనుభవించారు. విడుదలయ్యాక, సర్‌సంఘ్‌చాలక్ బాధ్యతలు స్వీకరించాక ఆయన మళ్ళీ సంఘం పనిలో నిమగ్నమయ్యారు.
1938లో భాగ్యనగరంలో హిందువుల మీద నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా హిందూ మహా సభ, ఆర్యసమాజ్ సంస్థలు ‘భాగ్యనగర నిశాస్త్ర ప్రతీకార్ మండల్’ అనే పతాకం కింద సత్యాగ్రహం చేయాలని నిర్ణయించాయి. ఆ సత్యాగ్రహంలో పాలుపంచుకోవాలని సంఘ కార్యకర్తలు భావించారు. వారికి డాక్టర్జీ సంతోషంగా అనుమతినిచ్చారు. సంఘం పని సాధారణంగా కొనసాగడానికి కొద్దిమంది మాత్రం ఉండిపోయారు. సత్యాగ్రహంలో పాల్గొనే స్వయంసేవకులు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పాల్గొనాలని హెడ్గేవార్ స్పష్టంగా చెప్పారు.
భాగ్యనగరంలో సత్యాగ్రహ నిర్వాహకులు ఆ ఘనతలో ‘సంఘం’ కూడా పాలుపంచుకుందని పదేపదే ప్రస్తావించే వారు. దాంతో డాక్టర్జీ వారికి లేఖ రాసారు. నిర్వాహకుల ఘనతలో సంఘం పేరును చెప్పనక్కరలేదని వారికి స్పష్టం చేసారు. తక్షణమూ, సాధారణమూ, ఘర్షణపూరితమూ అయిన దేశీయ ఉద్యమానికీ… దైనందినమూ, నిరంతరాయమూ, సృజనాత్మక స్వభావపూరితమూ అయిన సంఘ ఉద్యమానికీ… మధ్య తేడాను అర్ధం చేసుకోవాలి. దేశీయ ఉద్యమాలు విజయవంతం కావలసిందే. అదే సమయంలో, శాశ్వతమైన సంఘకార్యానికి ఆటంకాలు రాకూడదు అనే దార్శనికతతోనే డాక్టర్జీ ఆ విధానాన్ని అనుసరించారు.
ఆ కారణం వల్లనే, అటవీ సత్యాగ్రహం సమయంలో కూడా డాక్టర్జీ సర్‌సంఘచాలక్ బాధ్యతను డాక్టర్ పరాంజపేకు అప్పగించి, వ్యక్తిగత హోదాలో తానూ, ఇతర కార్యకర్తలూ ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
1942 ఆగస్టు 8న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ సమావేశంలో మహాత్మాగాంధీ మొదటిసారి ‘బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలిపెట్టిపోవాలి’ (క్విట్ ఇండియా) అనే చారిత్రక నినాదం ఇచ్చారు. మరుసటి రోజునుంచే ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. దేశంలో ఎక్కడికక్కడ నాయకులను అరెస్టులు చేసారు. విదర్భ ప్రాంతంలో అమరావతిలో బావోలీ, వార్ధాలో అష్టి, చంద్రాపూర్‌లో చిమూర్ వద్ద ప్రత్యేక ఉద్యమాలు జరిగాయి. చిమూర్‌లో క్విట్ ఇండియా ఉద్యమం వార్తను బెర్లిన్ రేడియో సైతం ప్రసారం చేసింది.
అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించినవారిలో కాంగ్రెస్ నాయకుడు ఉద్ధవ్‌రావ్ కోరేకార్, సంఘ్ నేతలు దాదానాయక్, బాబూరావ్ బెగ్డే, అన్నాజీ సిరాస్ ముఖ్యులు. అక్కడ బ్రిటిష్ వారి కాల్పుల్లో ప్రాణం కోల్పోయింది ఒకేఒక వ్యక్తి. అతను బాలాజీ రాయ్‌పుర్కర్ అనే స్వయంసేవకుడు. చిమూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన తుకాదో మహరాజ్ స్థాపించిన గురుదేవ సేవామండల్, సంఘ స్వయంసేవకులు కలిసి ఉద్యమాన్నీ, 1943 సత్యాగ్రహాన్నీ నడిపించారు. ఆ ఉద్యమంలో 125మంది సత్యాగ్రహులు, లెక్కలేనంతమంది స్వయంసేవకులను ఖైదు చేసారు.
క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతా విస్తరించింది. ప్రతీచోటా సంఘానికి చెందిన సీనియర్లు, కార్యకర్తలు, ప్రచారక్‌లు పాల్గొన్నారు. వారిలో కొందరు ప్రముఖులు… రాజస్థాన్‌లో ప్రచారక్ జైదేవ్‌జీ పాఠక్, విదర్భలోని ఆర్వీలో డాక్టర్ అన్నాసాహెబ్ దేశపాండే, ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో రమాకాంత్ కేశవ్ దేశపాండే. అనంతర కాలంలో అన్నాసాహెబ్ విద్యాభారతిలో ప్రధానపాత్ర పోషించారు, రమాకాంత్ కేశవ్ దేశపాండే వనవాసీ కళ్యాణ ఆశ్రమాన్ని స్థాపించారు.
ఢిల్లీలో చంద్రకాంత్ భరద్వాజ్, వసంతరావ్ ఓక్, బిహార్ పట్నాలో ప్రముఖ న్యాయవాది కృష్ణవల్లభప్రసాద్ నారాయణ్‌సింగ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మాధవరావ్ దేవడే, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దత్తాత్రేయ గంగాధర్ కస్తూరే… క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ స్వయంసేవకులు. చంద్రకాంత్ భరద్వాజ్ కాలిలో ఒక బులెట్ దిగింది. దాన్ని తీయడం సాధ్యం కాలేదు. గొప్ప కవి అయిన చంద్రకాంత్‌జీ తదనంతర కాలంలో సంఘానికి పలు గీతాలు రాసారు.
ఒకవైపు క్విట్ ఇండియా ఉద్యమం జోరుగా సాగుతోంది. బ్రిటిష్ వారు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది ఉద్యమకారులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయారు. అలాంటి కార్యకర్తలకు తమ ఇళ్ళలో ఆశ్రయం కల్పించడం చాలా ప్రమాదకరంగా ఉండేది. ఆ పనిని సంఘ సేవకులు తలకెత్తుకున్నారు. 1942 ఉద్యమ సమయంలో ఉద్యమకారిణి అరుణా అసఫలీ, ఢిల్లీ ప్రాంత సంఘచాలక్ లాలా హన్స్‌రాజ్‌గుప్తా ఇంట్లో తలదాచుకున్నారు. మహారాష్ట్ర సతారాకు చెందిన ఉద్యమకారుడు నానాపాటిల్, ఔంధ్ ప్రాంత సంఘ్‌చాలక్ పండిట్ సతావలేకర్ ఇంట్లో దాగారు. అలా, ఎందరో ఉద్యమకారులకు స్వయంసేవకులు, సంఘ నాయకులు తమ ఇళ్ళలో ఆశ్రయం కల్పించారు.
డాక్టర్జీ బాల్యం నుంచి మరణించేంతవరకూ ఆయన జీవితం దేశానికి, దేశ స్వాతంత్ర్యానికే అంకితమైపోయింది. సమాజాన్ని జాగృతం చేసి, దోషరహితంగా మార్చి, జాతీయవాద భావాలతో నింపే మార్గాన్ని ఆయన తన జీవిత ధర్మంగా ఎంచుకున్నారు. 1947 వరకూ సంఘం పని ‘హిందూ రాష్ట్రాన్ని’ స్వతంత్రం చేయడం అనే సంఘ ప్రమాణంలో కూడా ఉంది.
డాక్టర్ హెడ్గేవార్/సంఘం దార్శనికత:
డాక్టర్జీ సమయంలో సమాజం విచిత్రమైన సంఘర్షణల్లో చిక్కుకుని ఉండేది. కాంగ్రెస్-విప్లవవాదులు, తిలక్-గాంధీ, హింస-అహింస, హిందూమహాసభ-కాంగ్రెస్. అవి పరస్పరం ఘర్షించుకునే వాతావరణం ఉండేది. చాలాసార్లు, పరస్పర విభేదాల కారణంగా వారు బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడడం మానేసి ఒకరినొకరు ఏ ఆలోచనా లేకుండా వ్యతిరేకించుకుంటూ ఉండేవారు, వారిలోవారు కలహించుకుంటూ ఉండేవారు. 1921 సెంట్రల్ ప్రావిన్సెస్‌లో కాంగ్రెస్ సమావేశంలో ప్రాదేశిక స్థాయిలో జరిగింది. దానికి లోకనాయక్ ఆణే చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమావేశంలో, విప్లవకారుల చర్యలను ఖండించాలి అనే ప్రతిపాదన పెట్టబోయారు.
అయితే డాక్టర్ హెడ్గేవార్ వారిని వారించారు. మీకు విప్లవకారుల మార్గంపై విశ్వాసం లేకపోయి ఉండవచ్చు, కానీ వారి దేశభక్తిని శంకించకూడదు అని వివరించారు. అలాంటి పరిస్థితిలో డాక్టర్జీ జీవితం ఈ ద్వైదీభావాల మధ్య ఇరుక్కుపోలేదు. తిలక్-గాంధీ, గాంధీ-అహింస, కాంగ్రెస్-విప్లవకారులు వంటి సంకుచితమైన ఎంపికలు, రాజకీయ దృక్పథాలు, తత్వాలు, విధానాల్లో మగ్గిపోలేదు. ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా గమ్యం కంటె స్వతంత్రం సాధించాలన్న నిజమైన లక్ష్యమే అత్యంత ప్రధానమైనది అని హెడ్గేవార్ స్పష్టంగా వివరిస్తూ ఉండేవారు.
భారతదేశాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే చూస్తుండే ఒక వర్గంవారు ప్రతీ ఘనతనూ తామే సాధించిన కీర్తి సొంతం చేసుకోవాలని భావించేవారు. స్వతంత్రం రావడానికి ఇతరులు చేసిందేమీ లేదనీ, అంతా తామే చేసామనీ ఏకపక్షంగా ప్రచారం చేసుకునేవారు. అది సరైనది కాదు. సాయుధ పోరాటం నుంచి అహింసా సత్యాగ్రహం, సైన్యంలో విప్లవం నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రయత్నాలూ అన్నింటి కృషి వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించింది. చివరికి, రెండో ప్రపంచ యుద్ధం గెలిచిన తర్వాత ఇంగ్లండ్ దుస్థితి, దాని కాలనీలను పాలించుకునే సమర్ధత కోల్పోవడం, పాలించుకోడానికి విముఖత చూపడం కూడా కాదనలేని కారణాలే. చాలావరకూ బ్రిటిష్ కాలనీల్లో భారతదేశంలో సాగినంత సుదీర్ఘ స్వతంత్ర పోరాటం ఎక్కడా జరగలేదు. భారత్ తర్వాత అటువంటి కాలనీలకు కూడా బ్రిటన్ స్వతంత్రం ఇచ్చేసింది.
మహాత్మాగాంధీ చేసిన సత్యాగ్రహాల్లో 1942 సత్యాగ్రహమే ఆఖరిది. ఆ తర్వాత 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిందన్న మాట నిజం. కానీ 1942 ఉద్యమం కారణంగానూ, ఆ ఉద్యమంలో జైలుపాలైన నాయకుల ప్రయత్నాల వల్ల మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందనడం అసత్యం మాత్రమే, మిగతా స్వతంత్ర పోరాటయోధులకు అన్యాయం చేయడమే.
1947లో ఇంగ్లండ్ ప్రధానమంత్రి అయిన క్లెమెంట్ అట్లీ ‘‘మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం మీద చూపిన ప్రభావం సున్నా’’ అని స్పష్టంగా చెప్పాడు. కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్, బెంగాల్ గవర్నర్ అయిన పిఎం చక్రబొర్తి ఈవిధంగా చెప్పుకొచ్చాడు, ‘‘భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను ఉపసంహరించి దేశానికి స్వతంత్రం ఇచ్చిన లార్డ్ అట్లీ, నేను గవర్నర్‌గా ఉన్నప్పుడు రెండురోజులు కలకత్తాలోని గవర్నర్ ప్యాలెస్‌లో రెండురోజులు గడిపాడు. అప్పుడు బ్రిటిష్ వారు భారత్‌ను వదిలిపెట్టి వెళ్ళిపోడానికి నిజమైన కారణాలు ఏమిటన్న విషయం మీద నేను ఆయనతో సుదీర్ఘంగా చర్చించాను.
‘గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించి కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ వారిని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసేంత తప్పనిసరి పరిస్థితులు ఏమీ పుట్టుకురాలేదు. అలాంటప్పుడు మీరు భారత్ ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు’ అని అట్లీని నేరుగా ముఖం మీదనే అడిగాను.
దానికి అట్లీ చాలా కారణాలు చెప్పారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ సైనిక చర్యల కారణంగా భారత సైన్యానికి, నావికా దళానికీ బ్రిటిష్ రాచరికం మీద విధేయత క్షీణించిపోవడం వాటిలో ప్రధానమైన కారణం.
మా సంభాషణ చివర్లో నేను అట్లీని, బ్రిటిష్ ప్రభుత్వం భారత్ వదిలిపెట్టి వెళ్ళిపోవడంలో గాంధీజీ ప్రభావం ఎంత అని అడిగాను. అట్లీ పెదాలు ముడుచుకుని వ్యంగ్యంగా నవ్వుతూ మృదువుగా ‘నామమాత్రం’ అని చెప్పారు.’’
(రంజన్ బోరా, సుభాష్ చంద్రబోస్, ది ఇండియన్ నేషనల్ ఆర్మీ, ది వార్ ఆఫ్ ఇండియాస్ లిబరేషన్, జర్నల్ ఆఫ్ హిస్టారికల్ రివ్యూ, 20వ సంపుటం)
‘ది ఇండియాస్ స్ట్రగుల్’ అనే తన పుస్తకంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలా రాసారు, ‘‘కాంగ్రెస్‌కు, మహాత్మాకి అతని ప్రణాళిక గురించి ఇసుమంతైనా స్పష్టత లేదు. భారతదేశాన్ని స్వతంత్రం వైపు నడిపే క్రమంలోని దశల గురించి ఏమాత్రం తెలియదు. దానిగురించి వారు ఆలోచించనే లేదు’’ అని రాసుకొచ్చాడు.
చరిత్రకారుడు రమేష్‌చంద్ర మజుందార్ ‘త్రీ ఫేజెస్ ఆఫ్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం’లో ఇలా రాసాడు, ‘‘భారతదేశాన్ని విముక్తం చేయడంలో మూడు అంశాల ఉమ్మడి ప్రభావం ఉంది. అందులో కూడా, ప్రధానంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణలో వెల్లడైన నిజాలు, వాటికి భారతదేశపు ప్రతిస్పందనను బట్టి, అప్పటికే యుద్ధంలో మునిగిపోయిఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది. భారతదేశాన్ని పరిపాలించడానికి అది కేవలం సిపాయిల విధేయత మీద ఆధారపడలేదు. భారత్‌ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని వారు నిర్ణయించుకోడానికి అతిపెద్ద కారణం బహుశా అదే.’’
ఇవన్నీ చూసిన తర్వాత, స్వాతంత్ర్య సాధన క్రమంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం సాధించినది ఏమీ లేదు అనుకోవడం కూడా సరికాదు. అది నిజం కాదు. అలాగే, జైలుకు వెళ్ళడం మాత్రమే దేశభక్తికి నిదర్శనమని నమ్మడం కూడా సరైనది కాదు. స్వతంత్రపోరాటంలో క్రియాశీలంగా పనిచేసిన వారు; ఉద్యమంలో జైలుకు వెళ్ళినవారు; వారి కుటుంబాల బాధ్యత స్వీకరించిన వారు; అండర్‌గ్రౌండ్‌లోనుంచి ఆందోళనల్లో పాల్గొన్నవారు; అటువంటి రహస్య విప్లవకారులకు తమ ఇళ్ళలో ఆశ్రయం ఇచ్చినవారు; పాఠశాలల ద్వారా విద్యార్ధుల్లో దేశభక్తి భావనలను ప్రోదిచేసినవారు; స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నవారు; బ్రిటిష్ వారి ఆర్థికస్థితికి ఆటంకాలు కలిగించిన వారు; దేశీయ పరిశ్రమలను బలోపేతం చేసినవారు; జానపద కళలు, పాత్రికేయం, నవలలు, నాటకాల ద్వారా జాతిని జాగృతం చేసినవారు… ఇలా ప్రతీఒక్కరూ తమదైన కీలక భూమిక పోషించినవారే.
భారతదేశం కేవలం ఒక రాజకీయ భౌతిక విభాగం మాత్రమే కాదు. అది వేల యేళ్ళుగా శాశ్వతమూ, సమగ్రమూ, సమీకృతమైన జీవన దృక్పథంతో కూడిన సాంస్కృతిక అస్తిత్వం. ఆ జీవిత దృక్పథం, ఆ సంస్కృతి, సముద్రగర్భం నుంచి పర్వతశిఖరాగ్రం వరకూ వ్యాపించిన ప్రత్యేక అస్తిత్వం ఈ వైవిధ్యభరితమైన సమాజాన్ని ఏకీకృతం చేసి ఉంచుతున్నాయి. కాబట్టి, భారతదేశ చరిత్రలో విజయవంతమైన రాజకీయ మార్పులు చోటు చేసుకున్న ప్రతీసారీ, దానికంటె ముందు, భారతదేశపు ఆధ్యాత్మిక శక్తితో పాటు సాంస్కృతిక చైతన్యం కూడా కనిపిస్తుంది.
ఎప్పుడైనా అత్యంత సమస్యాత్మక పరిస్థితి తలెత్తినా, మన దేశంలో అంతకంటె మరెంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి జాగృతమవుతుంది. మొగలుల పరిపాలనా కాలంలో 12వ శతాబ్ది నుంచి 16వ శతాబ్ది వరకూ వ్యవధిలో దేశమంతటా సమాంతరంగా భక్తి ఉద్యమం వ్యాపించింది. ఉత్తరాన స్వామి రామానంద నుంచి దక్షిణాన రామానుజాచార్యుల వరకూ గురువులు ప్రతీ రాష్ట్రంలోనూ సాధువులు, సంతులు, సన్యాసులు, ఆధ్యాత్మికంగా మహానుభావులైనవారు ఒక్కో సంప్రదాయం ఆధారంగా భక్తి ఉద్యమాన్ని ప్రజల్లో ప్రచారం చేసారు.
బ్రిటిష్ వారికి బానిసత్వం కాలంలో స్వామి దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారి ఆధ్యాత్మిక నాయకత్వం మొదలైంది. భారతదేశ చరిత్రలో సాంస్కృతిక చైతన్యం లేకుండా ఏ రాజకీయ మార్పూ విజయవంతం కాలేదు. అలాంటి సాంస్కృతిక చైతన్యపు కృషిని సగటు రాజకీయాల పరామితులతో అంచనా వేయకూడదు, మదింపు చేయకూడదు. నిశ్శబ్దంగా, మౌనంగా విస్తరించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యం భారత్ వంటి దేశానికి ఎంతో ముఖ్యం.