మహిళా ఉద్యోగులకు ఒడిషా ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళలకు నెలకు ఒకరోజు నెలసరి సెలవు ప్రకటించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరీదా ఈ ప్రకటన చేశారు. మహిళలకు ప్రతి నెలా మూడు రోజులపాటు నెలసరి సెలవులు ఇవ్వాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ ఒడిషా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలకు నెలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలంటూ పార్లమెంటులో పెద్ద చర్చే జరిగింది. అయితే ఇది వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో వెనకడుగువేశారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. మహిళలకు మేలు జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంటే అది వారికి శాపంగా మారవచ్చు. వారిని ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం తగ్గిస్తే మరింత ప్రమాదమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కేరళలో బడికి వెళ్లే విద్యార్థినులకు నెలకు మూడు రోజులు నెలసరి సెలవులు ఇస్తున్నారు. ఇక దేశంలోని కొన్ని యూనివర్సిటీలు అక్కడ పనిచేసే మహిళలకు నెలకు మూడు రోజులు సెలవులు ఇస్తున్నాయి.