స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన చంద్రబాబు, గత ఐదేళ్ళలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఐదేళ్ళ తర్వాత స్వాతంత్య్రం లభించిందన్న చంద్రబాబు, ఐదేళ్ళుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, గుంటూరుజిల్లా తాడేపల్లిలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ రోజు ప్రతీ భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు అని ట్విట్టర్ లో జగన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నామన్నారు.