పోలవరం పనుల్లో కదలిక మొదలైంది. పోలవరం పనులు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలనే విషయాన్ని తేల్చేందుకు ఇటీవల విదేశీ నిపుణుల బృందాలు కూడా తనిఖీ చేశాయి. వారు ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం మధ్యలో నిర్మించే ప్రధాన డ్యాం వద్ద నిలువ ఉన్న వరద నీటిని ఇంజనీర్లు కిందకు వదిలేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా వరద నీటిని ఎత్తిపోసి పనులు చేపట్టాలని ప్రయత్నించారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రత్యేక గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎగువ ప్రాంతంలోని నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
పోలవరంపై నిపుణుల నివేదిక ( polavaram project works ) రాగానే పనులు ప్రారంభించేందుకు ఇంజనీర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా డయాఫ్రం వాల్ నిర్మించేందుకు వరద నీటిని ఖాళీ చేస్తున్నారు. వరద తగ్గగానే పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. దాదాపు 0.35 టీఎంసీల నీటిని దిగువకు వదలాల్సి ఉంది. వరద నీటికి ఖాళీ చేసి పనులు చేసే ప్రాంతంలో వచ్చే సీపేజీని మోటర్లు ద్వారా ఎత్తిపోయనున్నారు. మరో నెల రోజుల్లో పోలవరం పనులు పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.