ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ల సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమావేశం అర్ధమేమిటి, దాని ఫలితం ఎలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశ అనుకూల నిర్ణయాలకు వ్యతిరేకంగా వివాదాస్పద వైఖరులను అవలంబించడంలో ఒవైసీ దిట్ట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముస్లిములకు సంబంధించిన విషయాల్లోనూ, ఇస్లాం ఉగ్రవాద కార్యకలాపాల పైనా ఆయన వివాదాస్పద వైఖరి బహిరంగమే.
భారత రాజకీయాల్లో విభజనవాదానికి ప్రతీక అయిన ఒవైసీ, తరచూ రాజకీయ వివాదాలు సృష్టిస్తుంటాడు. బైటకు భారతదేశంలో ముస్లిముల హక్కుల కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తాడు. నిజానికి ఆయన ముస్లిములను పేదరికంలో మగ్గేలా చేసి, వారి తరఫున విక్టిం కార్డ్ వాడడంలో దిట్ట. అలాగే తన రాజకీయ మనుగడ కోసం, హైదరాబాద్ పాతబస్తీలో తన పార్టీ ఆర్థిక నెట్‌వర్క్‌ను విస్తరింపజేసుకోవడం కోసం హిందువులను భయభ్రాంతులను చేయడం ఒవైసీ విధానం. ఒవైసీ ఒకవైపు హింసను విమర్శిస్తున్నట్లు కనిపిస్తూనే ఇస్లామిక్ తీవ్రవాదం పైనా, ఉగ్రవాద కార్యకలాపాల విషయంలోనూ మరోలా మాట్లాడుతుంటాడు. సగటు ముస్లింలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ, హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటాడు, ప్రత్యేకించి, దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేసేవారిని ఆదరిస్తుంటాడు.
దానికి మంచి ఉదాహరణ, వికారుద్దీన్ అహ్మద్. అతను పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానితుడు. 2015లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. వికారుద్దీన్ అంతకుముందు చాలా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో నిందితుడు. పోలీసు అధికారులను చంపిన కేసులో కూడా నిందితుడుగా ఉండేవాడు. అలాంటి వికారుద్దీన్‌కు మద్దతుగా ఒవైసీ మాట్లాడడం, పోలీసుల చర్యలను తప్పుపట్టడాన్ని గమనిస్తే, దేశవ్యతిరేక శక్తులకు ఒవైసీ అనుకూలంగా వ్యవహరిస్తాడని అర్ధమవుతుంది, అతని రాజకీయ అజెండా పట్ల ఆందోళన కలుగుతుంది.
అదేవిధంగా, హైదరాబాద్‌కు చెందిన ముస్లిం యువత అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరడానికి ప్రయత్నించినప్పుడు, ఆ విషయంలో ఒవైసీ స్పందించకుండా ఉండిపోవడం వివాదాస్పదమైంది. అటువంటి విషయాల్లో వ్యూహాత్మక మౌనం పాటించడాన్ని గమనిస్తే, ముస్లిం సామాజికవర్గంలోని కొంతమంది అతివాదులుగా మారుతుండడాన్ని ఒవైసీ సమర్ధిస్తున్నాడని అర్ధమవుతుంది. అందువల్లే మైనారిటీల హక్కుల కోసం పోరాటం అన్న ముసుగులో అతివాదాన్ని ప్రోత్సహించేవాడిగా ఒవైసీని పరిగణించేవారికి కొదవ లేదు.
ఇటీవల పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఒవైసీ ‘జై పాలస్తీనా’ అంటూ నినాదాలు చేసాడు. పాలస్తీనాకు అనుకూలమంటూ తన వైఖరిని చాటుకున్నాడు. పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ద్వారా ఒవైసీ, అమెరికా మద్దతుతో గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలకు తన వ్యతిరేకతను బాహాటంగానే వ్యక్తం చేసాడు.
అయితే తాజాగా ఒవైసీ హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో సమావేశం అవడం అతని ద్వంద్వ వైఖరిని పట్టిస్తోంది. తన రాజకీయ వైఖరికి పూర్తి విరుద్ధమైన ఆ చర్య ద్వారా ఒవైసీ స్వార్థ విధానం బహిర్గతమైంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయి మద్దతు ఇస్తోంది. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టిన మిలటరీ చర్యలను సైతం సమర్ధిస్తోంది. ఆ చర్యలను ఒవైసీ తీవ్రంగా ఖండించాడు కూడా. అయినప్పటికీ, తన ఇజ్రాయెల్-వ్యతిరేక విధానానికి విరుద్ధంగా ఒవైసీ అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారితో సమావేశం అవడం అతని నైజం గురించి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒవైసీ మాటకు కట్టుబడేవాడు కాదా, నిలకడ లేనివాడా, అతని నిజమైన ఉద్దేశం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమెరికన్ దౌత్యవేత్త జెన్నిఫర్ లార్సన్ గతం కూడా వివాదాస్పదమైనదే. ప్రపంచంలో ఇస్లామిక్ ప్రాంతంగా పరిగణించే మధ్యప్రాచ్య దేశాలు, ఉత్తర ఆఫ్రికాలో అమెరికా తరఫున ఆమె జోక్యం చేసుకునేది. లిబియాలో నాటో జోక్యం సమయంలో అక్కడ అమెరికా వ్యవహారాల ఫలితంగా మహమ్మద్ గడాఫీ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అమెరికా తరఫున పనిచేసింది జెన్నిఫర్ లార్సనే. అలాంటి వివాదాస్పద అమెరికన్ దౌత్య అధికారితో భేటీ అంటే ‘డీప్ స్టేట్’ కబ్జాలోకి వెళ్ళినట్లే. అది కూడా, భారతదేశపు వివాదాస్పద రాజకీయ నాయకుడు ఒవైసీ అలాంటి డీప్ స్టేట్ ప్రతినిధితో సమావేశం అవడం ఆందోళనకరమే.
ఈ సమావేశం జరిగిన సమయం కూడా చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒవైసీ రాజకీయ చరిత్ర చూసుకుంటే ఎన్నో వివాదాస్పద భారత వ్యతిరేక వైఖరులకు కొదవ లేదు. అలాంటి నాయకుడితో అమెరికన్ డీప్‌స్టేట్ ప్రతినిధి సమావేశం కేవలం దౌత్యపరమైన మర్యాదాపూర్వకమైన సమావేశం అని ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు.
ఒవైసీతో జెన్నిఫర్ లార్సన్ సమావేశం కారణం ఏమై ఉండవచ్చు? భారతదేశపు అంతర్గత పరిస్థితులను, ప్రత్యేకించి దేశంలోని ముస్లిం జనాభాను ప్రభావితం చేయగల, లేదా కుదిపివేయగల సమర్ధత ఉన్న నాయకులతో అమెరికా ప్రత్యక్షంగా భేటీ అవడం అనేది ఆందోళన కలిగించే అంశమే. అందునా, జెన్నిఫర్ లార్సన్ గతంలో చేపట్టిన అసైన్‌మెంట్లను గమనిస్తే, ప్రాదేశిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, స్థానికంగా గడ్డు పరిస్థితులను రేకెత్తించి దీర్ఘకాలికంగా అస్థిరతను కలగజేసి, ఆయా దేశాలను అమెరికా తన గుప్పెట్లోకి లాక్కోవాలని చేసిన ప్రయత్నాల్లో ఆమె కీలక పాత్రధారి.
అందువల్ల ఒవైసీ, లార్సన్ సమావేశాన్ని సాదాసీదా భేటీగా కొట్టిపారేయడానికి వీలులేదు. ఒవైసీ విభజనవాదం, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉండే వ్యక్తులకు మద్దతునిచ్చే వైఖరి తెలిసినప్పుడు వివాదాస్పద అమెరికన్ దౌత్యవేత్తతో అతని సమావేశం ఆందోళన కలిగించక మానదు. భారతదేశపు అంతర్గత భద్రత, సామాజిక సామరస్యంపై వారి సమావేశం కలిగించే ప్రభావాన్ని విస్మరించలేము.
భారత ఉపఖండ పరిసరాల్లో ప్రాదేశిక ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే. బంగ్లాదేశ్‌లో భారత అనుకూల ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దె దించిన నాటి నుంచి నేటివరకూ జరుగుతున్న పరిణామాలు మన కళ్ళముందే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అసదుద్దీన్ ఒవైసీ-జెన్నిఫర్ లార్సన్ సమావేశాన్ని సాధారణ సమావేశంగా వదిలేయలేము. దేశంలోని ముస్లిం సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి, జాతీయవాద ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరుగుతున్న రకరకాల ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటై ఉండవచ్చుననే అనుమానాలు నిరాధారాలు కావు.