రామజన్మభూమిలో బాలరాముడి ఆలయ నిర్మాణంతో కొత్తశోభ సంతరించుకున్న అయోధ్యానగరంలో విచిత్రమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. పటిష్ఠ భద్రత కలిగిన భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో సుమారు 3800 బ్యాంబూ లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లు దొంగిలించారు. వాటి విలువ రూ.50 లక్షల పైమాటే. ఈ యేడాది జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలవి.
లైట్ల దొంగతనం వ్యవహారం ఆగస్టు 9న ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ కాంట్రాక్టు దక్కించుకుని విద్యుద్దీపాలు అమర్చిన యశ్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థల ప్రతినిధి… లైట్లు లేకపోవడం గమనించి ఆగస్టు 9న రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… సంస్థ రామ్‌పథ్‌లో 6400 బ్యాంబూ లైట్లు, భక్తిపథ్‌లో 96 ప్రొజెక్టర్ లైట్లు అమర్చింది. మార్చి 19న పరిశీలించినప్పుడు విద్యుద్దీపాలన్నీ ఉన్నాయి. అయితే మే 9న తనిఖీ చేసినప్పుడు కొన్ని లైట్లు లేవని గమనించారు.
సంస్థ ప్రతినిధి శేఖర్ శర్మ ‘‘మార్చి 19 వరకూ అన్ని దీపాలూ ఉన్నాయి. కానీ మే 9 నాటి తనిఖీలో కొన్ని దీపాలు పోయినట్లు తెలిసింది. గుర్తుతెలియని దొంగలు ఇప్పటివరకూ సుమారు 3800 బ్యాంబూ లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లు దొంగిలించారు’’ అని వెల్లడించారు.
స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.