చిన్నారి బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నేరం నిరూపణ అయిన నిందితుడు ఇంజమామ్ ఉల్ హక్‌కు అస్సాం కోర్టు 15ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసాడని నిరూపణ అయినందున కోక్రఝార్ కోర్టు పోక్సో చట్టం ప్రకారం శిక్ష విధించింది. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
30ఏళ్ళ ఇంజమామ్ ఉల్ హక్ అస్సాంలోని కోక్రఝార్ నివాసి. అతని ఇంటికి చేరువలోనే ఒక మైనర్ బాలిక కూడా ఉండేది. 2022 జనవరి 17న ఇంజమామ్ ఆ బాలికను ట్యూషన్‌కు తీసుకువెళ్ళే వంకతో ఆమె ఇంటినుంచి బైటకు తీసుకొచ్చాడు. ఆ బాలికను నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలా నాలుగు రోజుల పాటు ఆమెను తన చెరలో ఉంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో అస్సాం పోలీసులు బాలికకోసం వెతుకులాట ప్రారంభించారు. చివరికి బాధిత బాలిక, నిందితుడు ఢిల్లీ వెళ్ళారని గ్రహించి, పోలీసులు కూడా ఢిల్లీ వెళ్ళారు. అక్కడ బాలికను నిందితుడి చెర నుంచి విడిపించారు. తర్వాత ఇంజమామ్ ఉల్ హక్ మీద చార్జిషీట్ దాఖలు చేసారు. బాధిత బాలికకు, నిందితుడికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో నిందితుడు బాధితురాలిపై అత్యాచారం చేసాడని వెల్లడైంది.
కేసును విచారించిన కోక్రఝార్ కోర్టు జడ్జి, పోక్సో చట్టం సెక్షన్ 6 కింద ఇంజమామ్ ఉల్ హక్‌ను నేరస్తుడిగా తేల్చి 15ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. మరో మూడు నెలలు అదనపు జైలు శిక్ష విధించారు. అలాగే, ఐపీసీ సెక్షన్ల కింద ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా కూడా విధించారు.