పారిస్ ఒలింపిక్స్ 2024తో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు, గోల్‌కీపర్ శ్రీజేష్‌కు హాకీ ఇండియా అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సుమారు రెండు దశాబ్దాల పాటు శ్రీజేష్ ధరించిన జెర్సీ నెంబర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యపతకాన్ని సాధించింది. స్వాతంత్ర్య అనంతర భారత క్రీడా చరిత్రలో హాకీకి పునర్వైభవం వచ్చింది ఇటీవలి కాలంలోనే. పారిస్, అంతకుముందరి ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు వరుసగా రెండుసార్లు కాంస్యపతకం సాధించింది. ఆ రెండు సందర్భాల్లోనూ జట్టులో కీలక భూమిక వహించాడు గోల్‌కీపర్ పి ఆర్ శ్రీజేష్. ప్రత్యర్ధులు గోల్స్ చేయకుండా నిలువరించి, భారత జట్టుకు విలువైన విజయాలు అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. 36ఏళ్ళ శ్రీజేష్, పారిస్ ఒలింపిక్స్‌తో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని గౌరవార్ధం అతని జెర్సీ నెంబర్ 16ను ఇంకెవరికీ ఇవ్వకూడదని హాకీ ఇండియా నిర్ణయించింది.
హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి భోలానాథ్ ఆ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు, శ్రీజేష్ ఇకపై జూనియర్ నేషనల్ కోచ్‌గా వ్యవహరిస్తాడని వెల్లడించారు.
శ్రీజేష్ వీడ్కోలు సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో భోలానాథ్ మాట్లాడుతూ ‘‘శ్రీజేష్ ఇకనుంచీ జూనియర్ జట్టుకు శిక్షకుడిగా ఉంటారు. సీనియర్ జట్టులో జెర్సీ నెంబర్ 16కు విశ్రాంతి ఇస్తున్నాం. జూనియర్ జట్టులో జెర్సీ నెంబర్ 16ను రిటైర్ చేయడం లేదు. శ్రీజేష్ జూనియర్ జట్టులో ఇంకో శ్రీజేష్‌ను తీర్చిదిద్దుతాడు’’ అని ప్రకటించారు.