భారతదేశం ఆగస్ట్ 14ను దేశ విభజన దుర్మార్గాలను సంస్మరించుకునే దినంగా జరుపుకుంటోంది. 2021లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దినాన్ని ప్రకటించారు. దేశ విభజన ఎంత దుర్మార్గంగా, ఎంత నిర్లక్ష్యంగా జరిగింది, దానివల్ల ఎన్ని లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు, నిరాశ్రయులయ్యారు వంటి చరిత్రను అందరూ తెలుసుకోవాలన్నదే ఈ దినం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం.
ప్రపంచంలో ఎన్నోదేశాలు ఇలాంటి సంస్మరణ దినాలు జరుపుకుంటాయి. ఉదాహరణకు హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే. ఇలాంటి దినాల లక్ష్యం గతచరిత్రలో జరిగిన విషాద సంఘటనలను ఒకసారి స్మరించుకోవడం, వాటినుంచి పాఠాలు నేర్చుకోవడం, అలాంటి బాధాకర సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడడం.
బ్రిటిష్ పరిపాలన నుంచి దేశం విముక్తం కావడానికి జరిపిన పోరాటం ఫలితంగా భారత్‌ను వదిలిపెట్టి వెళ్ళిపోడానికి తెల్లవారు సిద్ధమయ్యారు. ఆ సమయంలో వారు భారతదేశం ఎప్పటికీ సుస్థిరంగా ఉండకూడదన్న కుట్రతో చేసిన దుర్మార్గమే దేశ విభజన. దాని ఫలితంగా భారతదేశం నుంచి పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఒకవైపు స్వాతంత్ర్యదినం వేడుకలు జరుపుకోడానికి సిద్ధపడుతూనే, దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న అత్యంత వేదనాపూరిత సంఘటనలను తెలుసుకోడానికే ‘విభజన బీభత్సాల సంస్మరణ దినం’ జరుపుకుంటున్నాం.
‘‘కొత్తగా స్వతంత్రం సాధించిన దేశంగా భారత్ అవతరించడం దేశవిభజన అనే హింసాత్మక గాయాలతో మొదలైంది, లక్షలాది భారతీయుల జీవితాలపై శాశ్వతమైన గాయాల మచ్చలు మిగిల్చింది. స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకోవడం సరే. అదే సమయంలో కృతజ్ఞతాభావం కలిగిన దేశం, అపరిమితమైన హింసాకాండలో తమ ప్రియ మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన కొడుకులు, కూతుళ్ళకు నివాళులర్పిస్తుంది’’ అని భారత ప్రభుత్వం ప్రకటించింది.
బ్రిటిష్ ఇండియాను మత ప్రాతిపదికన విభజించారు. ఫలితంగా హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశం, ముస్లింలు మెజారిటీగా ఉన్న పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పడ్డాయి. ఆ విభజన భారీస్థాయిలో వలసలకు కారణమైంది. భారతదేశంలోని ముస్లిముల్లో ఎక్కువమంది పాకిస్తాన్‌కు, హిందువులు, సిక్కులూ భారతదేశానికీ కట్టుబట్టలతో వలస పోయారు. ఆ వలసల కారణంగా దేశవ్యాప్తంగా మతహింస ప్రజ్వరిల్లింది. దాని ఫలితంగా ఎంతోమంది తీవ్రమైన బాధకు గురయ్యారు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం సుమారు 80లక్షల మంది ముస్లిమేతరులు పాకిస్తాన్ భూభాగం నుంచి భారతదేశానికి తరలి వచ్చేసారు. అదే సమయంలో సుమారు 75లక్షల మంది ముస్లిములు భారత్ నుంచి తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లకు (నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు) వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా భయంకరమైన హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఆ ఘటనల్లో సుమారు పదిలక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో అంచనాల్లో తేడాలున్నాయి. భారత ప్రభుత్వం ఆమోదించిన సంఖ్య ప్రకారం దేశ విభజన హింసాకాండలో సుమారు 5లక్షల మంది చనిపోయారు.
అసలు భారతదేశాన్ని ఎందుకు విభజించాల్సి వచ్చింది అని మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే… ముస్లిం లీగ్, దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం డిమాండ్ చేసారు. ఆ డిమాండ్‌కు బీజం 1940 మార్చి 23న పడింది, ఆ రోజు లాహోర్‌లో ఒక బహిరంగ సభలో జిన్నా ‘లాహోర్ తీర్మానాన్ని’ అంగీకరించాలని ప్రతిపాదించాడు. బ్రిటిష్ ఇండియాలోని ముస్లిములు తమ సాంస్కృతిక, సామాజిక, మత విలువలకు అనుగుణంగా బ్రతకడానికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఆ తీర్మానం కోరింది. నిజానికి ‘పాకిస్తాన్ ఏర్పాటు’ అన్న ఆలోచన అంతకుముందు కొన్ని దశాబ్దాలక్రితం నుంచే చర్చల్లో ఉంది.
ఆ చారిత్రక సంఘటన గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడంలో ‘దేశ విభజన బీభత్స గాయాల సంస్మరణ దినం’ కీలక పాత్ర పోషించింది, ఆ సంక్షుభిత సమయంలో అంతులేని హింస చోటుచేసుకుంది. తీరని వేదనకు కారణమైంది. వేల కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. దేశవిభజనతో తీవ్రంగా ప్రభావితమైన అసంఖ్యాక కుటుంబాలు, వ్యక్తులు అనుభవించిన గాఢమైన వేదనను, వారికి తగిలిన కనబడని గాయాలను గురించి సవివరంగా తెలుసుకోవడమే ఈ దినం జరుపుకోవడం వెనుక ఏకైక ఉద్దేశం. ఆ కథలను తెలుసుకోడానికి ఈ దినం ఒక వేదికను అందించింది. తద్వారా సహానుభూతి, అవగాహనలతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తోంది. చారిత్రక విమర్శ క్రమంలో ఒక విషాద ఘటన పట్ల మానవతా దృక్కోణాన్ని విస్మరించకూడదని తెలియజేస్తుంది.
ఈ సంస్మరణ దినం దేశ విభజన తక్షణ ప్రభావాన్ని తెలుసుకోవడం కంటే కూడా ఎక్కువగా సమాజానికి తన వాస్తవిక చరిత్రను సరిగ్గా అవగాహన చేసుకోవాలని పిలుపునిస్తుంది. దేశ విభజనకు మూలకారణాలు, సుదూరం విస్తరించిన దాని దుష్ఫలితాలు, విభజన పాఠాలను సహించి భరించే శక్తిసామర్థ్యాల గురించి చర్చలను ఈ దినం ప్రోత్సహిస్తుంది. అలాంటి చర్చల ద్వారా ఘనంగా ఎదిగే అవకాశమున్న దేశాన్ని అడ్డగోలుగా విభజించడానికి కారణమైన సంక్లిష్ట పరిస్థితులను గురించి సూక్ష్మభేదాలతో సహా అర్ధం చేసువడం సాధ్యమవుతుంది. పైగా, ఈ విభజన గాయాల సంస్మరణ దినం పాటించడం ద్వారా దేశప్రజల్లో ఐకమత్యం, సామరస్య భావనలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఈ దినాన్ని జరుపుకోవడం విభిన్న మతాల మధ్య చర్చలకు ప్రోత్సాహం ఇస్తుంది. మతం, కులం వంటి ప్రాతిపదికలతో దేశాన్ని ముక్కలు చేసుకునే విధానాన్ని పూడ్చివేస్తుంది. ఆ సమన్వయం ప్రజలకు ఒక జాగ్రత్త మప్పుతుంది. లక్షలాది ప్రజల ప్రాణాలతో ఆడుకునే విభజనవాద సిద్ధాంతాల వల్ల కలిగే ముప్పును విమర్శనాత్మకంగా అంచనా వేస్తుంది.