స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశరాజధాని దిల్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి దాదాపు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 15 నాడే ఈ దాడి జరుగుతుందని చెప్పలేమని,భద్రత పటిష్టంగా ఉండటంతో రెండ్రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల సంభాషణలను నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పంజాబ్‌లోని గ్యాంగ్స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర్య వేడుకలు, అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచిస్తున్నట్లు కూడా భద్రతా వర్గాలు తెలిపాయి.
జమ్మూలోని దోడా జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. అక్రా అటవీ ప్రాంతంలోని నదీ పరీవాహక ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వాడే ఎం16ఏ2కు ఇది తేలికపాటి రకం.2021 అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు బిలియన్ల డాలర్లు విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయాయి. వీటిని పాక్‌లోని ఉగ్రసంస్థలైన లష్కరే, జైషే సంస్థలు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వాటిని కశ్మీర్ కు చేరవేస్తున్నాయి.