రాష్ట్రపతి భవన్లో ‘అమృత్ ఉద్యాన్’ లో సందర్శకులను నేటి నుంచి అనుమతించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు దీనిని సందర్శించేందుకు అనుమతిస్తారు. సోమవారాల్లో మాత్రం మూసివేస్తారు.
సందర్శకులు తమ ఇళ్ళ ఆవరణలో నాటుకునేందుకు వీలుగా తులసి మొక్కల విత్తనాలతో కూడిన ‘సీడ్ పేపర్ల’ను పర్యావరణహిత జ్ఞాపికగా ఇవ్వనున్నారు. ఉద్యానవనంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా రాళ్లతో రూపొందించిన అబాకస్, ధ్వని వెలువడే గొట్టాలు, సంగీత కుడ్యాలు కూడా ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి భవన్ ఆవరణలో 15 ఎకరాల్లో విస్తరించిన అమృత్ ఉద్యాన్‌ను ప్రజలు ఉచితంగా సందర్శించేందుకు వీలు కల్పించారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 35వ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాక కియోస్కుల ద్వారా కూడా టోకెన్ తీసుకోవచ్చు. సమీప మెట్రోస్టేషన్ నుంచి అక్కడికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.