బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారంలో పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. గడచిన నెల రోజులుగా బంగ్లాదేశ్లో చెలరేగిన హింసలో 556 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడ్డ సంగతి తెలిసిందే.
బంగ్లాలో చెలరేగిన హింసలో ఇటీవల సయ్యద్ అనే కిరాణా వ్యాపారి కూడా మరణించాడు. అతని మరణానికి షేక్ హసీనా కారణమంటూ సయ్యద్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతోంది. హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించినా, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లా ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి రాగానే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమని ఆయన ప్రకటించారు.