కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమంగా నిల్వ చేసిన 26 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు గుర్తుచేశారు. కాకినాడ పోర్టు నిర్మించింది ఒక కుటుంబం కోసం కాదని, రాష్ట్ర ప్రజలకోసమన్నారు.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని నూకలు, ఉప్పుడు బియ్యం పేరుతో విదేశాలకు ఎగుమతి చేసినట్లు తేలిందని, త్వరలో ఈ కేసులో అరెస్టులుంటాయని మంత్రి తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎవరినీ ఇక్కడకు రానీయలేదని, కనీసం మీడియాను కూడా అనుమతించలేదని ఆయన గుర్తుచేశారు. అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి చేసిన వారికి 41ఏ నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేస్తామన్నారు.