నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ దేశ వ్యాప్తంగా వైద్యులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. కోల్‌కతా ఆర్జీ కార్ మెడకల్ హాస్పటల్ జూనియర్ డాక్టర్‌ను హత్య చేసి ఆ తరవాత నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా వైద్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. కొన్ని వైద్య సేవలు నిలిపేశారు. రక్షణ లేని చోట పనిచేయలేమని రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రకటించింది. నో సేఫ్టీ నో డ్యూటీ నినాదంతో నిరసన కొనసాగిస్తున్నారు. డాక్టర్లు పనిచేసే ప్రాంతాలను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
జూనియర్ డాక్టర్ మృతి తరవాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె కుటుంబసభ్యులకు ఆర్జీ కార్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఫోన్ చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికే 8 మంది వైద్యులను కూడా విచారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం నేనే చేశా, ఉరి తీసుకుంటారా తీసుకోండని నిందితుడు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. కేసును త్వరగా తేల్చాలని లేకుంటే సీబీఐకి అప్పగించాలని పశ్చిమబెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది.