దేవీ అహల్యాబాయి హోల్కర్ వ్యక్తిత్వం వర్తమాన సమాజానికి సైతం ఆదర్శప్రాయం. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యం కోల్పోక తన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాక విస్తరింపజేసిన వీరవనిత. నీతి నియమాలకు కట్టుబడి తన రాజ్యంలో ప్రజలకు సురాజ్యం అందించిన మహారాణి. పాలకులు ఎలా ఉండాలన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ అహల్యాబాయి. తన ప్రజలకు ఏ కొరతా, ఎలాంటి కష్టమూ లేకుండా చేయడం ఎలాగో ఆమెను చూసి నేర్చుకోవలసిందే.
అహల్యాబాయి తన కాలం నాటి గొప్ప దార్శనికత కలిగిన ఆదర్శ నాయకురాలు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి పరిశ్రమలు స్థాపించింది. ఆ పరిశ్రమల పునాదులు ఎంత బలమైనవంటే, మహేశ్వర్ ప్రాంతంలో ఆమె ప్రారంభించిన వస్త్ర పరిశ్రమ నేటికీ వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది.
అహల్య తన రాజ్యంలోని ప్రతీఒక్కరి పట్లా బాధ్యతగా వ్యవహరించేది. ప్రత్యేకించి అత్యంత బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచింది. ఆమె తన రాజ్యంలో పన్నుల భారంతో ప్రజలు కుంగిపోకుండా పన్నుల విధానాన్ని సంస్కరించింది. రైతులకు ఎలాంటి కష్టమూ లేకుండా చూసుకుంది. సుపరిపాలనకు ఆమె రాజ్యం నమూనాగా ఉండేది. తల్లి తన పిల్లల గురించి ఎలా జాగ్రత్తలు తీసుకుంటుందో అలా అహల్య తన ప్రజల గురించి జాగ్రత్తలు తీసుకునేది. నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం దేవీ అహల్యాబాయి హోల్కర్.
ఇవాళ మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అప్పట్లోనే అహల్యాబాయి మహిళా సాధికారతకు తన జీవితమే ఆదర్శంగా నిలిచేలా బ్రతికింది. భారతీయ మహిళలు ఎంత సమర్థులు, వారు దేన్నయినా ఎంత సులువుగా చేయగలరో తన జీవితం ద్వారా ప్రదర్శించింది.
అహల్యాబాయి పనితీరు చాలా ప్రత్యేకమైనది. ఆమె తన రాజ్యాన్ని ఎంతో నైపుణ్యంతో పరిపాలించింది. తన కాలం నాటి రాజులు అందరితోనూ గొప్ప స్నేహబాంధవ్యాలు నెరపింది. అహల్యాబాయి రాజ్యం పొరుగున ఉన్న రాజ్యాల పాలకులందరూ ఆమెను ‘దేవి’ అని గౌరవంగా వ్యవహరించేవారు. ఆమెను గౌరవాభిమానాలతో ఆదరించేవారు. తన రాజ్యంపై ఎలాంటి దండయాత్రలూ జరగకుండా అహల్యాబాయి గొప్ప రణనీతిని అనుసరించేంది. ఒకసారి రఘోబా దాదా పెద్ద సైన్యంతో చుట్టుముట్టాడు, ఆ సంక్షోభాన్ని ఆమె ఎంతో సాదాసీదాగా, ఎలాంటి ఘర్షణకూ తావు లేకుండా ఎదుర్కొంది. అందుకే ఆమె గొప్ప నైపుణ్యం కలిగిన వ్యవహర్త, అద్భుతమైన పాలకురాలు, వ్యూహకర్త, దౌత్యసంబంధాల్లో మహా రాజనీతిజ్ఞురాలు. ఆమె కేవలం తన రాజ్యాన్ని మాత్రమే కాదు, దేశం అంతటి గురించీ జాగ్రత్తలు తీసుకుంది.
భారతీయ సంస్కృతి అనే మహాప్రాసాదాన్ని బలోపేతం చేయడానికి అహల్యాబాయి హోల్కర్ దేశవ్యాప్తంగా దేవాలయాలు నిర్మింపజేసింది. తానే పాలకురాలు అయినప్పటికీ ఆమె తనను తాను ఎన్నడూ పాలకురాలిగా భావించలేదు. ఆమె ఎప్పుడూ ‘శ్రీ శంకరకృపే కరుణ’ అని జపిస్తూ ఉండేది. అంటే, శివ భగవానుడి ఆశీర్వాదాలతో రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె చాలా ఊళ్ళలో దేవాలయాలు, నదీఘట్టాలు, ధర్మశాలలూ నిర్మింపజేసింది. ఆ పనిని ఆమె భారతదేశం అంతటా చేపట్టింది. ఆమె పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు, వాణిజ్య మార్గాలను అభివృద్ధి చేసింది. తద్వారా భారతదేశ ప్రజలు అంతకుముందులాగే ధార్మిక క్షేత్రాలకు చేరుకునే అవకాశాలు కల్పించింది. ఆ మార్గాల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా వ్యాపారం చేసుకోడానికి అవకాశాలు కల్పించింది.
సమైక్యత అనేది చెక్కుచెదరకుండా, శాశ్వతంగా నిలబడాలి. అహల్యాబాయి దానికోసమే ప్రయత్నించింది. ఆమె దార్శనికతకు ప్రధాన కారణం ఆమె ధార్మిక విశ్వాసం. ఆమె ముందు తన దగ్గరున్న వనరులను సమీకరించుకుని అప్పుడే ధార్మిక కార్యక్రమాలను చేపట్టేది.
ఒక రాణి అయినప్పటికీ అహల్యాబాయి హోల్కర్ చాలా సరళమైన జీవితం గడిపేది. అహల్యా బాయి ఒక మహిళాధినేత, తన రాజ్యాన్ని పట్టించుకున్న ఆదర్శ మహిళ, తన రాజ్యాన్ని రక్షించుకున్న వీర వనిత, దేశ సమైక్యత కోసం కృషి చేసిన ధీర వనిత, సామాజిక సమన్వయం కోసం శ్రమించిన మహా మహిళ. అదే సమయంలో అహల్యాబాయి హోల్కర్ నిస్వార్థమైన, సరళమైన జీవితాన్ని గడిపిన గొప్ప మూర్తి. ఏడు పదుల జీవితాన్ని నిండుగా జీవించిన అహల్యకు నివాళులర్పిద్దాం.
(అహల్యాబాయి హోల్కర్ : 1725 మే 31 – 1795 ఆగస్టు 13)