బంగ్లాదేశ్లో 8శాతానికి తగ్గిపోయిన హిందూ జనాభా నానాటికీ దాడులకు గురవుతోంది. హిందువుల ఇళ్ళు ఖాళీ అవుతున్నాయి, గుడులు కూల్చివేతకు గురవుతున్నాయి, బంగ్లాదేశీ హిందువులు ఆర్తితో సహాయం కోసం అర్ధిస్తున్నారు.
ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామాచేసి, భారతదేశంలో ఆశ్రయం పొందడానికి వెళ్ళిపోవడంతో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు మొదలయ్యాయి. హిందూ మహిళలపై అత్యాచారాలు, హిందువుల ఇళ్ళు తగులబెట్టడాలు, దొమ్మీలు, మూక దాడులు, విధ్వంసాలు బంగ్లాదేశ్లో గత పదిరోజులుగా నిత్యకృత్యమైపోయాయి.
ఇది హిందువులపై హింసలో తాజా అధ్యాయం. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల మాటున హిందువులను చంపేస్తున్నారు. హిందువుల గుళ్ళు, ఇళ్ళు, దుకాణాలను లక్ష్యం చేసుకుంటున్నారు. ఢాకాలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను, బంగబంధు మెమోరియల్ మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసారు.
ఈ తరహా హింస, దాడులు కేవలం రాజకీయ వ్యవస్థ మీద ఆగ్రహజ్వాలలు మాత్రమే కావు. నిజానికివి మతపరమైన అసహనంతో కూడుకున్న ఘాతుకాలు.
ఈ విధ్వంసంలో ఇప్పటికే వందలాది ప్రాణాలు పోయాయి. దేశంలోని మొత్తం 64 జిల్లాల్లో కనీసం 52 జిల్లాల్లో మతఘర్షణలు తీవ్రస్థాయిలో చోటుచేసుకున్నాయి. హిందూమతస్తులపై ఏకపక్ష దాడులు భయంకరంగా జరిగాయి, జరుగుతున్నాయి.
హరధన్ రాయ్ వంటి కౌన్సిలర్లు హత్యకు గురయ్యారు. మెహెర్పూర్ ఇస్కాన్ మందిరం సహా పలు ఆలయాలను సమూలంగా నాశనం చేసారు. స్థానిక ముస్లిముల అతివాద హింసాకాండకు ఇవి బాహ్యంగా కనిపిస్తున్న కొద్దిపాటి ఉదాహరణలు మాత్రమే.
ఈ హింసాకాండకు ప్రాదేశిక ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ప్రత్యేకించి భారతదేశంపై ఈ హింసాకాండ ప్రభావం అమితంగా ఉంది. వేలాది హిందువులు ఇప్పటికే భారత్ చేరుకున్నారు. ఈ నరమేధం వల్ల దక్షిణాసియా ప్రాంతంలో శరణార్థి సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు భారతీయ రాజకీయ నాయకులు బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఇదేమీ ఒకసారి మాత్రమే జరిగిన సంఘటనో, కొత్తగా మొదటిసారి చోటుచేసుకున్న పరిణామమో కాదు. చారిత్రకంగా హిందువుల మీద నిరంతరాయంగా జరుగుతున్న దాడులు, ఊచకోతల కొనసాగింపే ఈ పరిణామం. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, రాజకీయ సంక్షోభానికి హింసాకాండ జత కలవడం 1970ల తొలినాళ్ళ నుంచీ జరుగుతూనే ఉంది. తాజాగా షేక్ హసీనా రాజీనామా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ వంటి అతివాద మిలిటెంటు సంస్థలు అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆ దేశంలోని హిందువులకు ఆందోళన కలిగిస్తోంది.
బంగ్లాదేశ్లో హిందువుల నరమేధంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ హింసాకాండను ఐక్యరాజ్య సమితి తప్పుపట్టింది. బంగ్లాదేశ్లో మైనారిటీల హక్కులను గౌరవించి రక్షించాలనీ, మతదురహంకార దాడులకు అంతం పలకాలనీ ఆ దేశాన్ని కోరింది.
మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. కానీ వాస్తవిక ఆచరణలో ఇప్పటివరకూ చేసిందేమీ లేదు.
బంగ్లాదేశ్లో తాజాగా జరుగుతున్న హిందువుల నరమేధం, మత దురహంకారం ఎంత భయంకరమైనదో వివరించడానికి, ఒక ముస్లిం దేశంలో హిందువుల బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో వివరించడానికి కావలసినన్ని సాక్ష్యాలను చూపిస్తోంది. ఆ దేశంలో రాజకీయ సంక్షోభం త్వరలోనే ముగిసిపోవచ్చు, కానీ మైనారిటీలుగా మారిపోయిన హిందువుల బ్రతుకులు నరకప్రాయమైపోయాయి. వారి ప్రాణాల భద్రతకు కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది అనుమానమే.