తిరుమల నారాయణగిరిలో శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16న ఛత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోమారు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
తిరుమల ఏడుకొండల్లోని నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపారు. అందువల్ల ప్రతీ ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.
నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండటంతో గాలులు ఉద్ధృతంగా వీస్తాయి. ఈ కాలంలో మరింత ఎక్కువగా ఉంటాయి . ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారనే కథ కూడా ప్రచారం కూడా ఉంది.
ఛత్రస్థాపనోత్సవంలో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. రంగనాయకుల మండపం నుంచి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట కు వెళతారు.
వేదపారాయణదారులు శాత్తుమొర నిర్వహించి, గొడుగును ప్రతిష్టిస్తారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18న జరగాల్సిన శ్రీవారి కల్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
ఆగస్టు 15 నుంచి 17 వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేదీ రాత్రి వరకు నిర్వహిస్తారు. అందువల్ల 18వ తేదీన కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.