ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎంఎల్సి సీటు ఉపయెన్నికకు అధికార తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయానికి కూటమి నేతలు ఆమోదించారు. ఉపయెన్నికల నామినేషన్లకు గడువు నేటితో ముగుస్తున్నందున చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడించారు.
వైఎస్ఆర్సిపి తరఫున సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నిన్న నామినేషన్ దాఖలు చేసారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందని చెప్పిన బొత్స, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు.
స్థానిక సంస్థల కోటా ఎంఎల్సి ఎన్నికకు మొత్తం 840 ఓట్లు ఉన్నాయి. వాటిలో 11 ఖాళీగా ఉన్నాయి. వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, తెలుగుదేశానికి 214మంది మాత్రమే ఉన్నారు. ఉపయెన్నిక నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో మంగళ, బుధ వారాల్లో సమావేశం కానున్నారు. ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రతినిధులతో ఇప్పటికే భేటీలు ముగిసాయి. మిగిలిన నియోజక వర్గాల ప్రతినిధులతో ఇవాళ, రేపు సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.