వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా కేంద్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను విడుదల చేశారు.
గత ప్రభుత్వం రైతులకు రూ. 1674 కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు ఉంచింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే వెయ్యి కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ. 674 కోట్లను మంత్రి ఇవాళ ఏలూరులో విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు రూ. 472 కోట్లు ఒకేసారి రైతుల ఖాతాల్లో వేసే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ధాన్యం బకాయిలు ఆలస్యం అయ్యాయన్నారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల కార్పోరేషన్ ని రూ. 40,550 కోట్ల రుణాల్లో ముంచేసిందని మండిపడ్డారు. రైతుల బకాయిలు రూ. 1674 కోట్లు తీర్చడానికి నాబార్డు, ఎన్సీడీసీ అధికారులతో మాట్లాడి రుణాలు తెచ్చామన్నారు.
కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గౌరవం దక్కే ఏర్పాటు చేస్తామని మనోహర్ వాగ్దానం చేసారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చామని చెప్పారు. ఈ-పంట ద్వారా సీసీఐసీ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేసి కౌలు రైతులందర్నీ ఆదుకుంటామన్నారు. రైతులకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మాటిచ్చారు. రైతులకు 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు సరఫరా చేస్తామన్నారు. పౌరసరఫరాల శాఖ రుణాలు రూ.40 వేల కోట్లలో 2025 మార్చి 31 నాటికి రూ. 10 వేల కోట్లు బ్యాంకర్లకు చెల్లిస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.