వక్ఫ్ చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వక్ఫ్ సంరక్షణ సమితి నాయకులు స్పష్టం చేసారు. వందలయేళ్ళుగా ఉన్న మసీదులు, దర్గాలు, పీర్లచావిళ్ళకు సంబంధించిన దస్తావేజులను నిరూపించుకోవాలంటూ కేంద్రం ప్రతిపాదిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు పెట్టి ముస్లిములలో అవగాహన కల్పిస్తామని, ఆ బిల్లును చట్టం కానీయకుండా వీలైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆదివారం విజయవాడలో ‘వక్ఫ్ సవరణ చట్టం 2024-పర్యవసానాలు’ అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ముస్లిం సంఘాలకు చెందిన అడ్వొకేట్లు, డాక్టర్లు, విద్యావంతులు, మత పండితులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ సర్కారు ఏకపక్షంగా వక్ఫ్ చట్టాన్ని మార్చేయాలని ప్రయత్నిస్తోందని వక్తలు ఆరోపణలు చేసారు.
అయితే, సచార్ కమిటీ సిఫారసు చేసిన సంస్కరణల గురించి కానీ, వక్ఫ్ బోర్డు యాజమాన్యాల అక్రమాల గురించి కానీ ప్రస్తావించలేదు. తమ కన్ను పడిన ప్రాంతాల మీద ఆకుపచ్చ గుడ్డ కప్పేసి వక్ఫ్ ఆస్తులుగా కాజేస్తున్న దుర్మార్గాల గురించి మాట్లాడలేదు. సుప్రీంకోర్టుకు సైతం జోక్యం చేసుకోలేనంత అపరిమిత అధికారాలు వక్ఫ్‌బోర్డు అనుభవిస్తుండడాన్ని గురించి నోరు మెదపలేదు.
మరి, రాష్ట్రంలోని హిందూ సంస్థలు ఏం చేయాలి? వక్ఫ్ చట్టానికి సవరణల గురించి సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేయడం సరిపోదు. క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలను ప్రచారం చేయాలి. దేవాలయాల్లో హిందువుల దేవతా విగ్రహాలపై చాదర్లు కప్పేసి, వాటిని మసీదులుగా ప్రచారం చేసి, వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి ఆక్రమించుకుంటున్న విషయాలను ప్రజలకు తెలియజేయాలి. ఆ విధంగా తమిళనాడులో ఏకంగా కొన్ని గ్రామాలకు గ్రామాలనే తమ ఆస్తిగా ప్రకటించుకుని కబ్జా చేసిన సంగతిని అందరికీ తెలిసేలా చేయాలి. తిరుమల తిరుపతి సమీపంలో అలాగే కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని మసీదులు కడుతున్న సంఘటనల గురించి ప్రచారం చేయాలి. రాజమండ్రిలో వేణుగోపాలస్వామి గుడిని ఆక్రమించి పెద్దమసీదుగా మార్చేసిన చరిత్రను వివరించాలి. మన జిల్లాల్లో స్థానికంగా అటువంటి సంఘటనలు జరిగిన ఉదంతాలను జాబితాగా చేయాలి. వాటిని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలి. వక్ఫ్‌బోర్డ్ పేరిట చేస్తున్న భూఆక్రమణల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. దేశవ్యాప్తంగా 9లక్షలకు పైగా ఎకరాల భూమిని కబ్జా చేసిన వక్ఫ్ బోర్డ్, పాకిస్తాన్ విస్తీర్ణం కంటె ఎక్కువ భూమిని మన దేశంలో కలిగి ఉందన్న నిజాన్ని అందరికీ తెలియజేయాలి. ఆ దిశగా హిందూ సంస్థలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి.