దేవాలయాల భూములకు రెక్కలు వచ్చాయి. కృష్ణా జిల్లా గుడివాడలో అతి పురాతన దేవాలయాలకు చెందిన విలువైన భూములను మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు కాజేశారు. గుడివాడలో 13వ శతాబ్ధానికి చెందిన భీమేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలకు వలిపర్తిపాడు, మల్లాయపాలెంలో రూ.75 కోట్లు విలువైన 25 ఎకరాల భూములున్నాయి. మొదట ఆ భూములు దేవదాసీలకు ఇచ్చారు. దేవదాసీ వ్యవస్థ రద్దు కావడంతో భూములు మరలా దేవాలయాలకు దక్కాయి. కౌలు పేరుతో తీసుకున్న కొందరు రాజకీయ నేతలు వాటిని కాజేశారు. ఎట్టకేలకు 2017లో ఆ భూములను ఆలయ రిజిస్టర్లో నమోదు చేశారు. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు.కావాలనే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది. ఆలయ భూములుగా చూపి ఇతరులను తప్పించినట్లు తెలుస్తోంది.
గుడివాడలో రెండు ప్రముఖ దేవాలయాలకు చెందిన భూములు తమవేనంటూ కొడాలి నాని, ఆయన సోదరుడు నాగేశ్వరరావు, కొడాలి నాని తల్లి వింధ్యారాణి మరో ఐదుగురు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. గత ఏడాది జులై 30న ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు నాగేశ్వరరావు, తల్లి విధ్యారాణికి ఎకరంన్నర చొప్పున దక్కింది. యార్లగడ్డ నాగమణి, దోనెపూడి అరుణ, సత్యసురేష్ కుమార్ మరో 7.5 ఎకరాలు దక్కించుకున్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టులో మూడు నెలల్లోగా సవాల్ చేయాల్సిన దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు హైకోర్టులో సవాల్ చేయలేదు.
గత ఏడాది జులై 30న ట్రైబ్యునల్ తీర్పు వచ్చింది. మూడు నెలల్లో రివ్యూ పిటిషన్ వేసుకోవాలి. కాని అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఆలస్యం అయినందుకు క్షమించాలంటూ అధికారులు కోర్టుకు అభ్యర్థించారు
హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నిస్తే అధికారులు వింత వాదన వినిపించారు. ట్రైబ్యునల్ నుంచి తీర్పు కాపీలు తమకు అందలేదనే వింత సమాధానం చెబుతున్నారు. మరలా వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే మిగిలిన భూములు కూడా కాజేసేవారేననే వాదన వినిపిస్తోంది.