తుంగభద్ర వరద ముంచెత్తనుంది అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయి లక్ష క్యూసెక్కుల వరద సుంకేసులకు చేరుతోందన్నారు. తుంగభద్ర పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు మంత్రి చెప్పారు. వారంపాటు వరద కొనసాగే అవకాశముంది. తుంగభద్ర నుంచి 60 టీఎంసీలు ఖాళీ చేసిన తరవాత కొత్త గేటు అమర్చనున్నారు. ఇప్పటికే 38 టన్నుల బరువైన గేటు తయారీ పనులు ప్రారంభం అయ్యాయని మంత్రి నిమ్మల తెలిపారు.
తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోవడంతో వరద జలాలు వృధాగా పోతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిందుకుండల్లా మారాయి. దీంతో తుంగభద్ర గేటు కొట్టుకుపోవడం ద్వారా 60 టీఎంసీల జలాలు సముద్రానికి చేరుతున్నాయి. రాయలసీమలో 6 లక్షల ఎకరాల సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలత్తే ప్రమాదముందుని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.