విద్యార్ధుల అల్లర్లుగా మొదలై, ప్రధానిని గద్దెదింపాక ముస్లిమేతర మతాలపై దాడులుగా మారిన బంగ్లాదేశ్ అరాచక పరిస్థితులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే హిందూయాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలను రక్షించాలన్న పిలుపుతో ఐక్యరాజ్యసమితి వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు’’ అని హిందూయాక్షన్ తమ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.
న్యూయార్క్‌లోని వేర్వేరు ప్రదేశాల్లో కూడా ఆ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో అమెరికా ప్రతినిధులు సైతం పాల్గొంటున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్యాట్ ఫాలన్ గళమెత్తారు. ‘‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్న రాజకీయ హింస, ఇతర మతస్తుల ఊచకోతను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడి మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశీ ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆ హింసాకాండను నిలువరించాలి’’ అని ఆయన ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.
‘‘హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, మరే ఇతర మతానికి చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, ఘాతుకాలకు పాల్పడడం గర్హనీయం. అటువంటి హింసాకాండను రెచ్చగొట్టినవారు, అందులో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ప్యాట్ ఫాలన్ డిమాండ్ చేసారు.
బంగ్లాదేశ్ హింసాకాండపై పలువురు అమెరికన్ నాయకులు గళమెత్తారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకు ముగింపు పలకడానికి ఆ దేశ ప్రభుత్వానికి సాయం చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, ఆ దేశ విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాసారు.