ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అర్జీలు స్వీకరించనుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఈ సదస్సులు జరగనున్నాయి. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజుపాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు.
భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులు అర్జీలు స్వీకరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతీ గ్రామానికి తహశీల్దార్ తో పాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అర్జీలను ఆన్ లైన్ చేసి.. దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతారని స్పష్టం చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్భార్‌లో ప్రతీరోజు భూ ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన భూ లాదేవీలపైనే ఎక్కువగా ఫిర్యాదులు అందాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.