ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన ఉగ్రవాదులు లఖ్బీర్సింగ్ లండా, హర్వీందర్ సంధూల సన్నిహితుడు, కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది అయిన తర్సేమ్‌సింగ్ 2023 నవంబర్‌లో అబూధాబీలో పట్టుబడ్డాడు. నేరస్తుల అప్పగింతకు సంబంధించిన విధివిధానాలన్నీ పూర్తి చేసిన ఎన్ఐఎ, నిన్న శుక్రవారం తర్సేమ్ను భారత్ తీసుకొచ్చింది.
తర్సేమ్‌సింగ్ పంజాబ్‌లోని తరణ్‌తారణ్ జిల్లాకు చెందిన వాడు. ‘బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్’ సభ్యుడు. అది దేశవ్యాప్తంగా ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన భయంకరమైన ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ. తర్సేమ్ సింగ్ మీద జూన్ 2023లో నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ అయింది. అప్పటినుంచీ ఎన్ఐఎ అతనికోసం వెతుకుతోంది. అంతేకాదు, అతనిమీద ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్ కూడా జారీచేసింది.
దేశంలో ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు తర్సేమ్‌సింగ్ కుట్రదారు. 2022 మేలో పంజాబ్ పోలీస్ ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయం మీద, 2022 డిసెంబర్లో తరణ్‌తారణ్ జిల్లాలోని సర్హాలీ పోలీస్ స్టేషన్ మీద రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఆ దాడులకు కుట్రపన్నడంలో, వాటిని అమలు చేయడంలో తర్సేమ్‌సింగ్ ప్రధానపాత్ర పోషించాడు. పంజాబ్‌ను భారత్ నుంచి విడదీసి ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయాలనే ఎజెండాను అమలు చేయడానికి ఆ ప్రాంతంలో అల్లకల్లోలం రేపడమే ఆ దాడుల ప్రధాన వ్యూహం.
ఖలిస్తానీ ఉగ్రవాదుల్లో ప్రముఖులైన లఖ్బీర్సింగ లండా, హర్వీందర్ సంధూ విదేశాల నుంచి తమ ప్రణాళికలు రచించి అమలు చేస్తుంటారు. భారతదేశంలో ఉన్న వారి అనుచరులకు ఆయా ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు నిధులను సమకూర్చి, సరఫరా చేసే కీలక బాధ్యత తర్సేమ్సింగ్ది. అంతేకాదు, ఉగ్రవాద కార్యకలాపాలకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు వాహనాలను సమకూర్చడం, ఆ పనులు పూర్తయే వరకూ పర్యవేక్షించడం కూడా తర్సేమ్‌సింగ్ బాధ్యతే.