బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. 65ఏళ్ళ ఒబేదుల్ హసన్ దేశాధ్యక్షుడు మొహమ్మద్ హుసేన్‌తో సంప్రదించి ఆ తర్వాత రాజీనామా చేస్తారని సమాచారం.
సీజే ఒబేదుల్ హసన్ సుప్రీంకోర్టు రెండు డివిజన్ల న్యాయమూర్తులతోనూ ఫుల్ కోర్ట్ మీటింగ్‌కు పిలిచారు. దాన్ని ఆందోళనకారులు న్యాయమూర్తుల కుట్రగా అనుమానిస్తూ హైకోర్టును చుట్టుముట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణం గద్దె దిగాలంటూ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు.
ఆ నేపథ్యంలో ఫుల్ కోర్ట్ సమావేశాన్ని సీజే వాయిదా వేసారు. తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
ఒబేదుల్ హసన్ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతేడాదే నియమితులయ్యారు. తాజాగా పదవీ చ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్‌హసీనాకు విధేయుడిగా ఆయనకు పేరుంది. ఆందోళనకారులు ఆయనకు రాజీనామా చేయడదానికి ఒక్క గంట సమయం ఇచ్చారు.
బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రవూఫ్ తాలూక్దార్ కూడా రాజీనామా చేసారు. కానీ ఆ పదవి ప్రాధాన్యత దృష్ట్యా ఆయన రాజీనామాను ఆమోదించలేదని ఆర్ధికవాఖ సలహాదారు సలేవుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. కొద్దిరోజుల ముందు బంగ్లాదేశ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్లు నలుగురు రాజీనామా చేసారు. సుమారు 4వందల మంది బ్యాంకు అధికారులు వారిపై అవినీతి ఆరోపణలు చేయడంతో వారు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది.
విద్యార్ధుల ఆందోళనగా మొదలై, షేక్ హసీనా దేశం వదిలిపెట్టిపోయిన కొద్దిగంటల్లోనే అరాచకశక్తుల చేతిలో పడిన ఉద్యమం ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంగా మారింది.