పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం వెలుగు చూసింది.నగరంలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తోన్న పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. అత్యాచారం తరవాత జూనియర్ డాక్టర్‌ను ఆసుపత్రి సెమినార్ హాలులో హత్య చేశారు. ఈ ఘటన బెంగాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. దుండగులను వదిలేదే లేదని సీఎం మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకుంటే ఆందోళనకారులు, లాఎన్ఫోర్స్మెంట్ను ఆశ్రయించవచ్చని కోరారు.
శనివారం రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల అనంతరం జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగినట్లు తేలింది. బాధితురాలి మర్మాంగాలు, కళ్లు, నోరు నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్ష ద్వారా గుర్తించారు.
ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ నేతలు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఓ అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడు ఆసుపత్రి మొత్తం విచ్చలవిడిగా తిరిగినట్లు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. అనుమానితుడిని పోలీసులు విచారిస్తున్నారు.