కథువా జిల్లా కొండప్రాంతాల్లోని మట్టి ఇళ్ళలో కనిపించిన నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేసారు. వారి గురించి విశ్వసనీయమైన సమాచారం చెప్పినవారికి రూ.20 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
జులై 8న మాఛేడీ అటవీ ప్రాంతంలో భారతసైన్యం పెట్రోల్ పార్టీ మీద ఉగ్రవాదులు దాడి చేసారు. ఆ దాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి పాల్పడినవారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదసంస్థకు షాడో గ్రూప్ అయిన కశ్మీర్ టైగర్స్. వారు కొన్నాళ్ళ క్రితం భారత భూభాగంలోకి చొరబడ్డారు. వారికోసం ఎంత గాలించినా వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.
కథువా పోలీసులు ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఆ ఉగ్రవాదుల రేఖాచిత్రాలను విడుదల చేసారు. వారు ఆఖరిసారిగా మల్హర్, బానీ, సేజ్‌ధర్ అడవుల్లోని ‘ఢోక్’ అని పిలిచే మట్టి ఇళ్ళలో కనిపించారని వెల్లడించారు. ఒక్కొక్క ఉగ్రవాది మీదా రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు. కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారం ఇచ్చినవారికి, ఆ సమాచారానికి తగినట్లుగా బహుమతి ఇస్తామని కూడా వెల్లడించారు.
జులై 8 దాడి తర్వాత జులై 15న దోడా జిల్లా దేసా అటవీ ప్రాంతంలో మరో గుంపు ఉగ్రవాదులు మరో దాడి చేసారు. ఆ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
దోడా జిల్లా పోలీసులు కూడా ఉగ్రవాదుల రేఖాచిత్రాలు విడుదల చేసారు. ఒక్కొక్కరిపైనా రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
అంతకుముందు జూన్ 9న రియాసీ జిల్లాలో శివ్‌ఖోరీ దేవాలయానికి వెళ్ళివస్తున్నభక్తుల బృందంపై ఉగ్రవాదులు దాడి చేసారు. ఏడుగురు భక్తులు సహా తొమ్మిది మందిని బలితీసుకున్నారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇంకా దొరకలేదు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు