బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. షేక్ హసీనా రాజీనామా తరవాత మరోసారి విద్యార్ధులు ఆందోళనలు తీవ్రం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటూ రోడ్లపై పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
షేక్ హసీనా దేశం వదలి వెళ్లిన తరవాత అక్కడ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ ప్రకటించారు. గడచిన నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసలో 450 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదు.
బంగ్లాలో మైనారిటీ హిందువులపై జరుగుతోన్న దాడులపై భారత్ అప్రమత్తమైంది. ఆదేశ సైనికాధికారులతో సంప్రదింపులు జరిపారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని కోరారు. అల్లర్లు తగ్గినట్టే తగ్గి మరోసారి భగ్గుమనడంతో, కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌లోని సంక్షోభంపై నిశితంగా పరిశీలిస్తోంది. బంగ్లాలోని 19వేల మంది భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అత్యవసరం అయితే వారిని తరలించే విషయంలో విదేశాంగశాఖ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.