బంగ్లాదేశ్ హింసాకాండలో ఇప్పటివరకూ 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల పేరిట దేశంలో జరిగిన హింసాకాండ, ప్రత్యేకించి హిందువులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, హిందూదేవాలయాల ధ్వంస ఘటనలూ విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆ క్రమంలో, పలువురు జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మీడియా భద్రత, హక్కుల అంతర్జాతీయ సంస్థ ప్రెస్ ఎంబ్లం క్యాంపెయిన్ (పిఇసి) బంగ్లాదేశ్లో జర్నలిస్టుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు వద్దంటూ మొదలైన ఉద్యమం మొదటి దశలోనే ఢాకాటైమ్స్ అనే బంగ్లా డిజిటల్ మీడియా సంస్థ జర్నలిస్టు హసన్ మెహదీ చనిపోయాడు. జులై 18న ఢాకాలోని జాత్రాబరి ప్రాంతంలో విద్యార్ధులు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ యేడాది బంగ్లాదేశ్లో హతమైన మొదటి జర్నలిస్టు, ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన 72వ జర్నలిస్టూ అతను. అదేరోజు భోరేర్ ఆవాజ్ దినపత్రిక పాత్రికేయుడు షకీల్ హుసేన్ గాజీపూర్ ప్రాంతంలో హతమయ్యాడు.
జులై 19న నయా దిగంత దినపత్రిక జర్నలిస్టు అబూ తాహెర్ మహమ్మద్ తురాబ్కు బులెట్ గాయాలయ్యాయి. సిల్హెట్ ప్రాంతంలో ర్యాలీ మీద పోలీసులు కాల్పులు జరిపిన క్రమంలో ఆ ఘటన చోటు చేసుకుంది. తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు ఢాకాలో తాహిర్ జమాన్ ప్రియో అనే ఫొటో జర్నలిస్టు కూడా చనిపోయాడు. ఆగస్ట్ 4న సిరాజ్గంజ్లో ఒక మూక దాడిలో ఖొబొర్పత్ర అనే దినపత్రిక ప్రతినిధి ప్రదీప్ కుమార్ భౌమిక్ హతమయ్యాడు.
‘‘బంగ్లాదేశీ జర్నలిస్టులు హతమైన ప్రతీ ఘటన మీదా నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. పోలీసులు, అధికార పార్టీ గూండాలు కలిసి చేసిన దాడుల్లోవందమందికి పైగా మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. బంగ్లాదేశ్లో జర్నలిస్టులు ఇప్పుడు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. వారి భద్రతకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఢాకాలోని కొత్త ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి’’ అని పిఇసి అధ్యక్షుడు బ్లెయిస్ లెంపెన్ డిమాండ్ చేసారు.
‘‘బంగ్లాదేశ్లో ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నాయి. అందువల్ల సమాచార సేకరణపై ప్రభావం పడుతోంది. దాంతో బాధిత జర్నలిస్టుల గురించి పూర్తి వివరాలు తెలియడం కష్టంగా మారింది. పొరుగున ఉన్న భారతదేశంలో ఈ యేడాది శివశంకర్ ఝా, ఆశుతోష్ శ్రీవాస్తవ అనే ఇద్దరు జర్నలిస్టులు హతమారిపోయారు. పాకిస్తాన్లో ఎనిమిది మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు’’ అని పిఇసి దక్షిణాసియా ప్రతినిధి నవా ఠాకురియా వివరించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు