గాజాపై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు చేసింది. తూర్పు గాజా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఓ పాఠశాలలో నక్కారనే నిఘా వర్గాల సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. హమాస్, హెజ్బొల్లా అగ్రనేతలు ఇటీవల హతం కావడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రనేతలను ఇరాన్ గడ్డపై హతం చేయడంతో ఆ దేశం కూడా యుద్ధానికి కాలుదువ్వుతోంది. ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభం కావచ్చనే భయాందోళనలు కొనసాగుతున్నాయి.
గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై పాశవికంగా దాడి చేసిన తరవాత మొదలైన యుద్దంలో ఇప్పటి వరకు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అంతం చేసే వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పలుమార్లు హెచ్చరించారు. పలుదేశాలు చేస్తున్న కాల్పుల విరమణ ప్రయత్నాలు ఫలించలేదు. ఇజ్రాయెల్‌పై దాడులు జరిగే అవకాశం ఉండటంతో భారత్ అన్ని విమానాలను ఆదేశానికి నిలిపేసింది.