వినేష్ ఫోగాట్ వ్యవహారంతో నిరాశలో ఉన్న భారత బృందానికి, మల్లయోధుల జట్టులోని ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఊరట కల్పించాడు. ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయినా, మూడోస్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యపతకాన్ని పట్టుకొచ్చాడు.
ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత్ నుంచి పోటీ పడిన ఏకైక క్రీడాకారుడు అమన్ సెహ్రావత్ శుక్రవారం నాడు కాంస్యపతక పోరులో విజయం సాధించాడు. ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టో క్రజ్ మీద 13-5 తేడాతో ఘనవిజయం సాధించాడు.
పోరు ప్రారంభంలో దరియన్ ఆధిక్యం చూపినా, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి పాయింట్ దరియన్ సాధించినా, తర్వాత నుంచీ అమన్ పూర్తిస్థాయిలో చెలరేగిపోయాడు. పంచ్ మీద పంచ్ విసురుతూ మొదటి రౌండ్ పూర్తయేసరికి 6-3 ఆధిక్యంతో నిలిచాడు. ఆట పూర్తయేసరికి ఏకంగా 13 పాయింట్లు సాధించిన అమన్, ప్రత్యర్థిని కేవలం 5 పాయింట్లకే పరిమితం చేసాడు.
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో భారతదేశం 2008 నుంచీ క్రమం తప్పకుండా పతకాలు సాధిస్తోంది. ఆ పరంపరను అమన్ నిలబెట్టాడు. 2008లో సుశీల్ కుమార్ కాంస్యపతకం గెలిచాడు. 2012లో సుశీల్‌కుమార్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించారు. 2016లో సాక్షి మలిక్ కాంస్యపతకం గెలిచింది. 2020లో రవి దహియా రజత పతకం, బజరంగ్ పూనియా కాంస్యపతకం సాధించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ అమన్ సెహ్రావత్ ఇప్పుడు 2024లో కాంస్యపతకం తీసుకొచ్చాడు.
అమన్ కాంస్యంతో భారత్ పట్టికలో ఆరు పతకాలు చేరాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతిచిన్న క్రీడాకారుడు 21ఏళ్ళ అమన్ సెహ్రావతే కావడం విశేషం. ఇక ఇవాళ మహిళల రెజ్లింగ్ 76 కేజీల విభాగంలో రీతిక పోటీ పడుతుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు పాల్గొనే ఆఖరి ఈవెంట్ అదే.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు