బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ మతాలవారిపై జరుగుతున్న హింసాకాండ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మారణకాండను తీవ్రంగా ఖండించింది.
‘‘లక్ష్యం చేసుకుని హత్యలు చేయడం, లూటీలు, దహనాలు, హిందువులు సహా ఇతర మైనారిటీ మతాల వారి మహిళలపై అత్యాచారాలు, బంగ్లాదేశ్‌లోని హిందూ మందిరాలను ధ్వంసం చేయడం సహించరానివి’’ అని ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళె అన్నారు.
‘‘ఆ దేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అటువంటి దురాగతాలను తక్షణం నిలిపివేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధితుల ధనమానప్రాణాలను కాపాడడానికి సరైన ఏర్పాట్లు చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు.
ఈ సంక్లిష్ట సమయంలో బంగ్లాదేశ్‌లో హత్యలు, అత్యాచారాలకు గురవుతున్న బాధితులకు సంఘీభావంగా నిలవాలని ప్రపంచదేశాల ప్రజలు, భారతదేశంలోని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేసారు.
‘‘పొరుగున ఉన్న మిత్రదేశంగా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు తదితరుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.
అంతకుముందు, ఆగస్టు 6న విశ్వహిందూపరిషద్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ విచిత్రమైన అనిశ్చితి, హింసాకాండ, అరాచకంలో ఇరుక్కుపోయిందని ఆందోళన వ్యక్తం చేసారు. షేక్ హసీనా ప్రభుత్వం రాజీనామా చేయడం, ఆమె దేశం వదిలిపెట్టేయడం జరిగాక తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచింది.
‘‘ఈ కొద్దిరోజుల్లోనూ బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, సిక్కులు ఇతర మైనారిటీల ఇళ్ళు, గుళ్ళు, వ్యాపార స్థలాలను దోచుకున్నారు, ధ్వంసం చేసారు. హింసాకాండ, ఆటవిక దాడులకు గురికాని జిల్లా ఒక్కటి కూడా బంగ్లాదేశ్‌లో మిగల్లేదు’’ అని అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తంచేసారు.
‘‘ఈ సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణ, వారి మానవహక్కుల పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజలు సమర్థమైన కార్యాచరణతో ముందుకు రావాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.