హర్యానా సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు గుడ్ మార్నింగ్ బదులుగా జైహింద్ అని నినదించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వివరించింది. “జై హింద్” అని నినదించడంతో దేశ గొప్ప చరిత్ర పట్ల గౌరవం ఉండేలా విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని అధికారులు వివరించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ఇక స్వాతంత్య్రానంతరం భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత పట్ల తమ నిబద్ధతకు చిహ్నంగా దేశ సాయుధ బలగాలు కూడా ఈ నినాదాన్ని స్వీకరించాయి.