ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1995 సమావేశంలో ప్రతీయేడాదీ ఆగస్టు9ని ప్రపంచ ఆదివాసీల దినంగా జరుపుకోవాలని తీర్మానించింది. అయితే 12ఏళ్ళ చర్చల తర్వాత కూడా నిజమైన మూలనివాసులు అని ఎవరిని పిలవాలన్న విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు. కాబట్టి ఈ రోజును అన్ని దేశాలూ గుర్తించాలన్న బలవంతం ఏమీ లేదని ఐరాస నిర్ణయించింది. వివిధ దేశాల్లో వాటివాటి రాజ్యాంగాల పరిధులకు లోబడి ప్రజల హక్కులకు సంబంధించిన విధాన దార్శనిక పత్రంగా ఐరాస నిర్ణయాన్ని పరిగణించవచ్చు.
ఆ అంశంపై జరిగిన ఓటింగ్‌లో భారత ప్రభుత్వం ఐరాసకు ఒక షరతుతో కూడిన మద్దతు ఇచ్చింది. అదేంటంటే ‘భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ భారతదేశవాసులే’. కెఎం మున్షీ, విశ్వనాథ్ దాస్, జైపాల్సింగ్ముండా, బిఆర్ అంబేడ్కర్ మధ్య రాజ్యాంగసభలో జరిగిన చర్చ తర్వాత భారతదేశం ఆ నిర్ణయం తీసుకుంది. ‘భారతదేశంలో నివసించే అందరూ భారత పౌరులే’ అని రాజ్యాంగం పేర్కొనడాన్ని జైపాల్‌సింగ్ ముండా మొదట వ్యతిరేకించినా తర్వాత హృదయపూర్వకంగా మద్దతిచ్చారు. ఇంక ‘షెడ్యూల్డు తెగలు’ అనే పదం 342వ అధికరణం కింద మాత్రమే పరిగణనలో ఉంది. ఆదివాసులు, నివాసులు, మూలవాసులు వంటి పదాల ప్రస్తావన లేదు. ఇక రాజ్యాంగసభ చర్చలో ఆయా తెగలకు ఇచ్చే ప్రత్యేక అవకాశాల గురించి కూడా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి సూచించిన హక్కుల కంటె గిరిజనులకు మరిన్ని ఎక్కువ హక్కులను భారత రాజ్యాంగం ఇస్తోందని భారతదేశం ఐక్యరాజ్యసమితికి స్పష్టం చేసింది. భారత పార్లమెంటులో వివిధ తెగల వారికి ప్రాతినిధ్యం ఉంది. ఆయా తెగల హక్కులను కాపాడడానికి అవసరమైనప్పుడల్లా చట్టాలు చేస్తున్నారు.
అందుకే, ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్‌లోని కొన్ని అంశాలు భారతదేశం, దాని రాజ్యాంగపు స్ఫూర్తికీ వ్యతిరేకంగా ఉంటాయి. గిరిజనులకు స్వీయపాలన, మరో దేశపు పౌరసత్వం, సొంత మతం కాకుండా వేరొకరి మతాన్ని స్వీకరించడం, ఇతర దేశాల నుంచి ఆర్థికమద్దతు తీసుకోవడం వంటివి అవి.
భారత విదేశాంగ విధాన నిపుణులు పునరుద్ఘాటించేది ఏంటంటే., ఎన్నో దేశాలను ఎన్నోయేళ్ళు పరిపాలించిన ఐరోపా దేశాలు ఆయా దేశాల్లో దారుణమైన సామూహిక మారణకాండకు, ఊచకోతకూ పాల్పడ్డాయి. భారత్0 తన ప్రజలను ఎలా చూసుకోవాలి, వారికి ఎలాంటి హక్కులు ఇవ్వాలి అని సలహా ఇచ్చే నైతిక హక్కు సదరు దేశాలకు లేదు. కలోనియల్ దుష్టశక్తులు భారత్‌కు సలహా ఇవ్వడం మానేసి అవి భారత రాజ్యాంగం నుంచి, దాని పార్లమెంటరీ విధానం నుంచీ పాఠాలు నేర్చుకోవడం మంచిది.
వలస పాలకుల జనహననకాండ:
పాశ్చాత్య దేశాల్లో దీన్ని వలసదారుల సామూహిక జనహననకాండ లేక సెటిలర్ల జెనోసైడ్ అంటారు. పాశ్చాత్య ఐరోపా ప్రాంత శక్తులైన బ్రిటన్, స్పెయిన్‌ల విస్తరణవాదం ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఓషియానియా, ఆసియా దేశాల్లో జనహననకాండకు దారితీసింది. ఆ కలోనియల్ జెనోసైడ్లో చనిపోయినవారి సంఖ్య హిట్లర్ మారణహోమంలో చనిపోయినవారి సంఖ్య కంటె చాలా ఎక్కువ. మరింత భయంకరం కూడా.
రఫాయెల్ నెమ్కిన్ అనే పరిశోధకుడి పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. కలోనియల్ జెనోసైడ్ రెండు దశల్లో జరిగింది. మొదటి దశలో స్థానిక సంస్కృతి, జీవనవిధానాలను నాశనం చేసారు. రెండో దశలో ఆక్రమణదారులైన వలసపాలకుల జీవన విధానాలు, సంస్కృతి, మతాన్ని నిజమైన మూలవాసులపై బలవంతంగా రుద్దారు. దాన్నే సాంస్కృతిక హననం అంటారు. వలసపాలకులు ఎంతటి దుర్మార్గాలకు ఒడిగట్టారంటే వారు వైరస్లు (స్మాల్‌పాక్స్), బ్యాక్టీరియా (కలరా) వంటి జీవాయుధాలను వినియోగించడానికి కూడా వెనుకాడలేదు.
ప్రభుత్వ అంచనాల ప్రకారమే చూసుకున్నా అమెరికాలో వలసపాలకుల జనహననకాండ (కలోనియల్ జెనోసైడ్) కారణంగా మూలవాసుల సంఖ్య 15వ శతాబ్దంలో 14.5 కోట్ల నుంచి 18వ శతాబ్దంలో 70లక్షలకు పడిపోయింది. 13.80 కోట్ల మందిని ఊచకోత కోసేసిన వలసపాలకులు అక్కడితో సంతృప్తి చెందలేదు. మిగిలిన 70లక్షల మందినీ దేశం నుంచి తరిమేసారు. దానికోసం ఒక చట్టం కూడా చేసారు. ఇండియన్ రిమూవల్ యాక్ట్ 1830 అనే చట్టం ప్రకారం వారు అమెరికా మూలవాసులను మిసిసిపీ నది పశ్చిమ ప్రాంతాన ఉన్న బంజరు భూముల్లోకి తరిమి తరిమి కొట్టారు. ఆ విషాదకర ఘటననే అమెరికా చరిత్రలో ‘కన్నీటి నది’ అని వ్యవహరిస్తారు. దక్షిణ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వంటి దేశాల్లో సైతం అలాగే భయంకరంగా ఊచకోత కోసి, వారి గడ్డ మీదనుంచి తరిమేసారు.
ఆదివాసీల దినం భారతదేశానికి అవసరమా?:
గతయేడాది ఈ దినం సందర్భంగా ఎంచుకున్న అంశం ‘స్వీయ నిర్ణయాత్మకత కోసం మార్పుకు ప్రతినిధులుగా ఆదివాసీ యువత’. వేర్పాటువాదం, నక్సలిజం వంటి సమస్యలతో పోరాడుతున్న భారతదేశంలో ఆ అంశాన్ని నిజం కాగలదా? ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోడానికి నక్సలైట్లను వేర్పాటువాదులనూ భారతదేశం వదిలేయాలా? ఐక్యరాజ్యసమితి ఎంచుకొన్న అంశం నేటికీ ఇంకా వలసపాలనలో నలిగిపోతున్న దేశాలకు వర్తిస్తుందేమో తప్ప… ఇప్పటికే నలువైపులా శత్రుదేశాలు చుట్టుముట్టి ఉన్న భారతదేశానికి ప్రాణాంతకమే.
విదేశీ ఆక్రమణదారులతో 800 ఏళ్ళు పోరాడిన చరిత్ర భారతదేశానిది. మన అంతర్గత సమస్యలను, మన వైవిధ్యాన్నీ అవకాశాలుగా తీసుకుని విభజనశక్తులు మన దేశాన్ని రక్తపాతంతో ఎలా విభజించారో అందరికీ తెలుసు. సాంస్కృతిక వైవిధ్యాన్ని విభజన దృష్టితో చూసే పాశ్చాత్యదేశాల దృక్కోణానికి భారతీయ విధానం పూర్తిగా భిన్నమైనది. ఎన్నో శతాబ్దాలుగా అందరినీ కలుపుకునిపోయే సంస్కృతిని అనుసరిస్తున్న భారతదేశం… భాష, కులం, జాతి, మతం, జీవనవిధానంతో సంబంధం లేకుండా అన్నివర్గాలూ కలిసి జీవించగల శాంతియుత వాతావరణాన్ని కలిగి ఉందన్న సంగతిని మనం మరచిపోకూడదు.
అయినప్పటికీ, ఇప్పటికీ భారత వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న పంజాబ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరం వంటి రాష్ట్రాల్లో చిచ్చు రేపుతూనే ఉన్నాయి. భారతదేశాన్ని వెయ్యిముక్కలుగా విభజించాలన్న విస్తారమైన అంతర్జాతీయ కుట్రలో భాగంగానే అలాంటి కుట్రలు జరుగుతున్నాయని సులువుగానే అర్ధం చేసుకోవచ్చు.
వివిధ ఉగ్రవాద, మావోయిస్టు సంస్థలతో పాటు ఐసిస్, పిఎఫ్ఐ వంటి నిషిద్ధ సంస్థలపై దాడుల సందర్భాల్లో భారత రక్షణ, పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్న సాహిత్యాన్ని గమనించాక, వారికి అంతర్జాతీయ సహాయ సహకారాలు అందుతున్న సంగతి విస్పష్టంగా తెలుస్తోంది. ప్రాంతం, భాష, సంస్కృతి, మతాచారాల ఆధారంగా ప్రత్యేక అస్తిత్వం పేరిట దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారు. అంతర్జాతీయ సహకారంతో జరుగుతున్న అటువంటి చర్యలు దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయి.
భారతదేశపు బలం, దాని అత్యంత బలహీనమైన వర్గపు బలానికి అనులోమానుపాతంలో ఉంది. అందుకే భారతదేశ రాజ్యాంగం దేశప్రజలందరికీ — ధనికులు, పేదలు, బలవంతులు లేక బలహీనులు అందరికీ — సమాన అవకాశాలు కల్పించింది. సమానత్వం, సౌభ్రాతృత్వం, సౌహార్దభావాలలో దృఢవిశ్వాసం కలిగి ఉన్నందునే భారతదేశం దాని అంతర్గత, బాహ్యశత్రువులను నిర్మూలించగల శక్తిని కలిగి ఉంది.
తన జనజాతులను గౌరవించుకునే భారతదేశం:
భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల సేవలను ఘనంగా ప్రకటించే ఉద్దేశంతో, దేశం స్వతంత్రం సాధించి 75ఏళ్ళు గడిచిన సందర్భంగా 2021లో భారత ప్రభుత్వం, బిర్సాముండా జయంతి అయిన నవంబర్ 15ను గిరిజన గౌరవ దినంగా ప్రకటించింది. బిర్సాముండా, ముండా తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారికి, మత మార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వీరుడు. అతిపిన్న వయసులో తిరుగుబాటు చేసిన యోధులు అతికొద్దిమందిలో ఆయన ఒకడు. భారత ప్రభుత్వం ప్రతీ యేడాదీ గిరిజన గౌరవ వారోత్సవాలు నిర్వహిస్తూ తద్వారా వారి సాంస్కృతిక, భాషా వైవిధ్యాలను ప్రాచుర్యంలోకి తెస్తోంది. దేశంలోని విభిన్నమైన తెగల ఉనికి, అస్తిత్వం, అభివృద్ధికి సంబంధించిన ప్రతీ అంశాన్నీ చర్చించి ఆచరణలోకి తెస్తోంది. వలస పాలకుల కంటె తమ స్థానిక మూలనివాసీ కథానాయకులకు ప్రాధాన్యతనిస్తున్న దేశాలు ఎన్ని ఉన్నాయి? మనం మన చరిత్ర చదువుకోవాలా లేక ఆక్రమణదారుల చరిత్ర చదువుకోవాలా? మూలనివాసుల దినం పేరిట మనం ఆగస్టు9న వేడుకలు చేసుకోవాలా లేక బిర్సాముండా జయంతి అయిన నవంబర్ 15న వేడుకలు చేసుకోవాలా? ఆ విషయం గురించి భారతదేశపు యువత ఆలోచించాలి, నిర్ణయించాలి. వర్తమాన భారతాన్ని పరిశీలిస్తే 28రాష్ట్రాల్లో 7రాష్ట్రాల ముఖ్యమంత్రులు గిరిజన తెగలకు చెందినవారు ఉన్నారు. అంతెందుకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గిరిజన తెగకు చెందిన మహిళ. అదీ, ప్రస్తుత ప్రభుత్వం మూలనివాసులకు ఇస్తున్న గౌరవం.
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినం జరుపుకోవడం 2007నుంచి బాగా పెరిగింది, గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో గిరిజన సంస్థలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో యువతరం పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఐరోపా శక్తులు తాము ఆక్రమించి పరిపాలించిన దేశాల్లో మూల నివాసులను ఎలా ఊచకోత కోసాయో గుర్తు చేసుకోవాలి, అలా చనిపోయిన వారికోసం కన్నీరు కార్చాలి.
అసలు ప్రపంచ ఆదివాసీల దినం ఎలా పుట్టింది?:
అక్టోబర్ 12ను కొలంబస్ డే, డే ఆఫ్ (యూరోపియన్) రేస్ అంటారు. అమెరికా సహా చాలావరకూ వలసపాలక దేశాల్లో ఆ రోజు జాతీయ సెలవుదినం. ఆ రోజున గొప్ప వేడుకలు జరుపుకుంటారు.
క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీకి చెందిన నావికుడు. స్పెయిన్ రాజు అతన్ని భారతదేశానికి సముద్రమార్గం కనుగొనమని, అక్కడినుంచి సుగంధ ద్రవ్యాలు తీసుకురమ్మనీ ఆదేశించాడు. కొలంబస్ భారతదేశానికి చేరుకోలేకపోయాడు. దానికి బదులు అమెరికాలోని బహామాస్ ద్వీపానికి 1492 అక్టోబర్ 12న చేరుకున్నాడు. అక్కడ భారతీయ సుగంధ ద్రవ్యాలు దొరకవు కాబట్టి స్థానిక ఆదివాసీ మహిళలను నిర్బంధించాడు. వారిలో కొందరిని రాజసభలో నగ్నంగా ప్రవేశపెట్టి రాజుకు కానుకగా ఇచ్చాడు. మిగిలినవారిని వెనిస్లో వేశ్యలుగా అమ్మేసాడు. అప్పటినుంచీ 300 సంవత్సరాల పాటు ఆ అరాచకం కొనసాగింది. బహామాస్ దీవులకు చెందిన ఆదివాసీ మహిళలను ఎత్తుకుపోవడం, వేశ్యలుగా విక్రయించడం అనే ఘాతుకం 3శతాబ్దాలపాటు సాగింది. నేటికీ మూల ఆదివాసీలపై ఐరోపా జాతీయుల అణచివేత అమెరికా సహా వారి వలస దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాంటి దేశాలన్నీ కొలంబస్ను ‘జాతి పిత’గా భావిస్తాయి. 1996లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ‘కొలంబస్ డే’ని జాతీయ సెలవుగా ప్రకటించాడు, ఆరోజును గొప్ప వైభవంగా వేడుకలు చేసుకోవాలని ఆదేశించాడు.
క్లింటన్ ఆదేశాలతో అమెరికా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు భగ్గుమన్నారు. అక్టోబర్ 12ను మూలవాసీల సామూహిక హనన దినంగా గుర్తించాలంటూ ఆందోళనలు ప్రారంభించారు. అప్పటికే కొలంబస్ డేను అధికారికంగా గుర్తించారు, వలసపాలక దేశాలు అన్నింటిలో ఆరోజున వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా మూలవాసీల ఆందోళనలతో వాటన్నింటికీ ముప్పు వచ్చిపడింది. ఆ వివాదాన్ని ముగించడానికి మార్గాలు అన్వేషిస్తూ, అమెరికా ప్రత్యేకంగా ప్రపంచ ఆదివాసీల దినం ఒకదాన్ని మొదలుపెట్టింది. అమెరికా చేతిబొమ్మ అయిన ఐక్యరాజ్యసమితిలో వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇండైజెనస్ పీపుల్స్ మొదటి సమావేశం 1982 ఆగస్టు9న జరిగింది. కాబట్టి ఆగస్టు 9నే ప్రపంచ ఆదివాసీల దినంగా నిర్వహించాలని నిర్ణయించారు.
భారతదేశంలో ఆదివాసీల దినం ఎలా జరుపుకోవాలి?:
ఆగస్టు 9ని ఆదివాసీల ఘనతలను చాటడం కోసం నిర్వహించాలి. కానీ భారతదేశంలో జాతి వ్యతిరేక శక్తులు ఆ రోజును మతమార్పిడులకు, విభజన ఎజెండాను విస్తరింపజేయడానికీ వాడుకుంటున్నాయి. దురదృష్టవశాత్తూ ఆ శక్తులు తమ ప్రయత్నాల్లో చాలావరకూ విజయం సాధించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా కంటెంట్‌ను తయారు చేయడం కోసం, దాన్ని వ్యాపింపజేయం కోసం సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఫలితంగా వివిధ తెగల మధ్య వేర్పాటువాద భావాలు విస్తరిస్తున్నాయి. ఆదివాసీల నుంచి ఎదిగి ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు సైతం శత్రుమూకలతో చేతులు కలుపుతున్నారు.
మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కేవలం గిరిజనులు మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతీ ఒక్క పౌరుడూ ఇక్కడి మూలవాసే. మన పూర్వీకులు చేసిన అపూర్వ త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛాదేశంగా మనగలుగుతున్నాం. మన దేశానికి స్వతంత్రం సాధించడంలో సమాజంలోని అన్నివర్గాల ప్రజలూ కలిసి పనిచేసారు.
అంతర్జాతీయ ఆదివాసీల దినం అనేది భారతదేశం వరకూ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాడుతున్న కుట్ర అన్న విషయం అర్ధం చేసుకోవాలి. ఆ కుట్రను ఎదుర్కోడానికి భారతీయులందరం ఐక్యంగా ఉండాలి. ప్రపంచం అంతటా ఆదివాసీల జనహననం ఎలా జరిగిందో గుర్తుచేసుకోడానికి ఈ దినాన్ని చేసుకోవాలి. అందరం కలిసుండాలి అని చాటిచెప్పే భారతీయ మార్గాన్ని ప్రపంచానికి చూపించాలి.