శ్రావణమాసం వచ్చిందంటే తెలుగింట ప్రతీరోజూ పండుగ వాతావరణమే. సిరులతల్లి శ్రీ మహాలక్ష్మిని కొలుస్తూ ఈ మాసం అంతా ప్రత్యేకమైన నిష్ఠ పాటిస్తారు. నోములు, వ్రతాలతో తెలుగు లోగిళ్ళు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతూ ఉంటాయి.
సంపదకు, సౌభాగ్యానికి శ్రీలక్ష్మీ అమ్మవారు ప్రతీక. మానవులు సుఖమయమైన జీవితం గడపటానికి అవసరమైన వాటిని అనుగ్రహించేది ఆ తల్లే. ధనధాన్యాదులు సంతాన, ఆరోగ్య జ్ఞానాదులన్నీ ఆమె కృపే. సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలన్నా, శ్రేష్ఠమైన సంపదతో విలసిల్లాలన్నా సిరులతల్లి ఆశీస్సులు కావాల్సిందే. అందుకే ఈ మాసంలో అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తారు.
శ్రావణమాసంలో నేడు తొలి శుక్రవారం కావడంతో పాటు నాగపంచమి, గరుడ పంచమి పండుగలు కూడా కలిసిరావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.తిరుమల, శ్రీశైలం, బెజవాడ ఇంద్రకీలాద్రి, , సింహాచలం ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గురువారం శ్రావణశుద్ధ చవితి కావడంతో శ్రీశైలంలో నాగుల విగ్రహాల వద్ద పంచామృతాలతో అభిషేకాలు చేశారు. నువ్వుల పిండి, చలిమిడి, వడపప్పులను ప్రసాదంగా నివేదించారు.
నేడు శ్రావణ శుద్ధపంచమి కావడంతో ఉజ్జయినిలో నాగచంద్రేశ్వరుని ఆలయం తెరిచారు. జ్యోతిర్లింగ క్షేత్రాలలో దక్షిణాభిముఖుడైన శివుడు వెలిసిన ఏకైక క్షేత్రం ఉజ్జయిని అని శాస్త్రాల్లో పేర్కొన్నారు. మహాకాళేశ్వరునికి అనాదిగా పూజలు నిర్వహిస్తున్నవారు నాగారాధకులే కావడం విశేషం.
మహాకాళేశ్వర లింగానికి కింద శంఖయంత్రం ఉండంతో ఆయన దర్శనం చేసుకున్నవారు జీవితంలో అన్ని విజయాలూ పొందుతారని విశ్వాసం. మహాకాళేశ్వరునికి అనునిత్యం నాలుగుసార్లు భస్మహారతి జరుగుతుంది. ఆ సమయంలో స్వామి దర్శనంతో అకాల మృత్యువు దూరమవుతుందని నమ్మకం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో శ్రావణ మాసం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈవో రామారావు మాట్లాడుతూ శ్రావణమాసాన్ని శ్రీ కనకదుర్గమ్మ తల్లి పుట్టిన మాసంగా భక్తులు భావించి ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు.