లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ ముఖ్యనేత మనీశ్ సిసోడియాకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సిసోదియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించడంతో పాటు , సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
లిక్కర్ స్కామ్ లో భాగంగా గతేడాది అక్టోబర్ నుంచి తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దాదాపు 17 నెలలుగా జైలులో ఉంటున్నందును బెయిల్ ఇవ్వాలని కోరారు.
సిసోడియా విచారణకు సహకరించడం లేదని, జాప్యం చేస్తున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.
పిటిషన్ పై గురువారం నాడు వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్‌పై తీర్పును రిజర్వు చేసింది. నేడు బెయిల్ ఉత్తర్వలు జారీ చేసింది.