బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే తన తల్లి హసీనా మరలా తిరిగి వస్తుందని మాజీ ప్రధాని కుమారుడు సజీబ్ వాజబ్ జాయ్ స్పష్టం చేశారు. అమెరికాలో నివశిస్తోన్న సజీబ్ వాజబ్ జాయ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో సజీబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అవామీలీగ్ పని అయిపోయినట్లేనని కొందరు చేస్తోన్న వాదనల్లో నిజం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోవడం వెనుక పాక్ ఐఎస్ఐ కుట్ర ఉందని సజీబ్ అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా గత సోమవారం ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో ఓ రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నాయి. బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. మరో వారంపాటు ఆమె ఢిల్లీలోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది.
బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్ట చేశారు. బంగ్లాదేశ్‌లోని భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. బంగ్లాలో మొత్తం 19 వేల మంది భారతీయులు ఉండగా, వారిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారు. బంగ్లాదేశీయులు పెద్దఎత్తున భారత్ రావాలని ప్రయత్నాలు ప్రారంభించడంతో అక్కడి నాలుగు వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.