వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. దీంతో విపక్షాలు బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామని కేంద్రమంత్రి కిరెన్ తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును కేంద్రమంత్రి కిరెన్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. విపక్ష నేతలు మాట్లాడుతూ, ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభజనకు దారితీస్తుందన్నారు. ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తాము అంగీకరించేదే లేదని కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్షాల ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజు, సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామన్నారు. దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. మతపరమైన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. ఇప్పటివరకు హక్కులు పొందని వారికి దీంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. వక్ఫ్ బోర్డులను మాఫియా ఆక్రమించిందని చాలా మంది ఎంపీలు చెప్పడంతో పాటు కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు రిజిజు తెలిపారు.
వక్ఫ్ పాలకవర్గాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి.కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.