అక్కినేని నాగచైతన్యకు నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గురువారం ఉదయం ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. శోభితను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామని నాగార్జున పేర్కొన్నారు.
ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షించారు. 8.8.8.. హద్దులేని ప్రేమకు నాంది అని పేర్కొన్నారు.
నటి సమంత, నాగ చైతన్య 2017లో ప్రేమించుకుని పెద్దల సమ్మతితో కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టు తెలిపారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
చైతూ-శోభిత ప్రేమించుకుంటున్నారని, సహజీవనం చేస్తున్నారనీ కూడా చాలా రోజులుగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
శోభిత గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అమ్మాయి. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచిన శోభిత, ఆ తర్వాత 2016లో ‘రామన్ రాఘవన్’ అనే తమిళ సినిమాలో నటించారు. తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించారు. హాలీవుడ్ లోనూ అడుగుపెట్టారు. భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు.