బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అరాచకశక్తులు ప్రధానమంత్రిని గద్దెదింపేసి దేశం నుంచి తరిమేసాయి, హిందువులను ఊచకోత కోస్తున్నాయి. హిందూమహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఆస్తుల విధ్వంసం చేస్తున్నాయి. అలాంటి ఆందోళనకర పరిస్థితులు భారతదేశంలోనూ తలెత్తుతాయా? అంటే అవుననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల లక్ష్యం దేశంలో హింసను ప్రేరేపించడమే అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వంటి పరిస్థితులు భారతదేశంలోనూ తలెత్తగలవు అని వ్యాఖ్యానించారు. దానిపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. భారతదేశపు ప్రజాస్వామిక వ్యవస్థలను తక్కువ అంచనా వేస్తున్న కాంగ్రెస్, దేశంలో హింసను రెచ్చగొడుతోందని మండిపడ్డారు.
‘‘మోదీపై ద్వేషంతో వారు భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు. సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ హింసాకాండ లాంటి సంఘటనలు భారతదేశంలో జరగాలని కోరుకుంటున్నారా, అలా రెచ్చగొడుతున్నారా? భారతదేశంలో హిందువులపై దాడులు జరగాలని కోరుకుంటున్నారా? లేక అలా చేయాలని సంకేతాలిస్తున్నారా? అతని కుటుంబం ఇప్పటికే ఓట్ జిహాద్ గురించి ఒకసారి చెప్పింది. ఇప్పుడింక ప్రత్యక్షంగా హింసాకాండను ప్రేరేపిస్తోందా? ఇది భారతదేశపు ప్రజాస్వామిక వ్యవస్థలను తక్కువ చేయడం కాదా? దేశనీతి కంటె రాజకీయాలే వారికి ఎక్కువ అనడానికి ఇది మొదటి నిదర్శనం ఏమీ కాదు. సల్మాన్ ఖుర్షీద్ మీద కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా?’’ అని షెహజాద్ ఎక్స్ మాధ్యమం ద్వారా ప్రశ్నించారు.
అసలు సల్మాన్ ఖుర్షీద్ ఏమన్నారు?
మంగళవారం ఒక కార్యక్రమంలో ప్రసంగించిన సల్మాన్ ఖుర్షీద్, భారతదేశంలో పరిస్థితి సాధారణంగానే కనిపిస్తోంది కానీ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగవచ్చు అని సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ‘‘కశ్మీర్లో అంతా బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు. ఇక్కడా (ఢిల్లీలో) అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు. మనం విజయం సాధించామని సంబరాలు చేసుకుంటూ ఉండిఉండవచ్చు. ఆ విజయం నామమాత్రమే అనీ, ఇంకా చాలా సాధించాలనీ కొందరు అనుకొంటూ ఉండవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, పైకి కనిపిస్తున్నదానికింద ఇంకొకటుంది. వాస్తవం ఏంటంటే బంగ్లాదేశ్‌లో జరిగినదే ఇక్కడ కూడా జరగవచ్చు. అయితే మన దేశంలో వ్యాపించే విధానం, బంగ్లాదేశ్లోలా పేలిపోకుండా ఉంటుంది’’ అన్నారు.
విపక్షాల ఆరోపణలు, ప్రకటనలు:
బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, దేశ విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్షం తరచుగా భారతదేశంలో అధికార మార్పిడి జరగడం కోసం గొడవలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. కులం, మతం, రిజర్వేషన్లు ఇలాంటి సున్నితమైన అంశాల ఆధారంగా దేశాన్ని ముక్కలు చేయడానికి రెచ్చగొడుతూనే ఉన్నారు.
జనవరి నెలలో యోగేంద్ర యాదవ్ ఒక వ్యాఖ్య చేసాడు. ‘‘ఈ రిపబ్లిక్‌ను మళ్ళీ పొందాలనుకుంటున్న వాళ్ళం మన రాజకీయాల గురించి తీవ్రధోరణిలో పునరాలోచించాలి. మన రిపబ్లికన్ విలువలను బలంగా సమర్ధించుకోడానికి మనకు ఒక కొత్త రాజకీయ భాష కావాలి. మనం పార్లమెంటరీ ప్రతిపక్షం నుంచి ప్రతిరోధక రాజకీయాలవైపు మళ్ళాలి’’.
తన వ్యాఖ్యను గురించి యోగేంద్ర యాదవ్ ఇలా వివరించాడు. ‘‘మొదటి రిపబ్లిక్ దేశపు మరణంలో మన నేరాన్ని గురించి మనకు తెలియాలి. తమ ఉనికి కోసం పని చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్నీ, బిజెపినీ నిందించడం అనవసరం. మొదటి రిపబ్లిక్ యొక్క రాజ్యాంగానికి విధేయత ప్రకటించుకున్న వారిమీదనే బాధ్యత ఉండాలి. నిబద్ధ రాజకీయాల నుంచి అవకాశవాద రాజకీయాలవైపు లౌకికవాదపు క్రమ క్షీణత ఈ విధ్వంసానికి కారణమైంది. లౌకికవాద ఆలోచనాధోరణి తలపొగరు, ప్రజలతో అది సంబంధాలు లేకుండా ఉన్న తీరు, ప్రజలతో వారి భాషలో మాట్లాడడానికి అది నిరాకరిస్తున్న విధానం, అన్నీ లౌకికవాదం అన్న ఆలోచననే ధర్మవిరుద్ధం చేసేసాయి.’’
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కూడా భారత్ బంగ్లాదేశ్ పరిస్థితులు ఒక్కలాగే ఉన్నాయంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. ‘‘భారతదేశపు ఆర్థికాభివృద్ధిని పక్కన పెడితే నిరుద్యోగం, అసమానతల వంటివి గణనీయంగా పెరిగిపోయాయి. అవి బంగ్లాదేశ్ వంటి పరిస్థితులకు దారితీస్తాయి’’ అన్నారాయన. ‘‘బంగ్లాదేశ్‌లో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలు లేవన్న భయంతో అక్కడి ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆగిపోయాయి. భారత్ ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు, మన ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాయి’’ అని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవలి మన ఎన్నికల చట్టబద్ధతపై ఆందోళనలు ఉన్నాయి. దాదాపు 89 సీట్లలో మొదటి, చివరి దశల ఓటర్ టర్నవుట్‌లో తేడాలు జరిగినట్లు విశ్లేషణల్లో తేలింది’’ అంటూ వ్యాఖ్యలు చేసారు.
మణిశంకర్ వ్యాఖ్యలపైనా బిజెపి మండిపడింది. సమస్యల్లో ఉన్న పొరుగుదేశంతో భారత్‌ను పోల్చడం ఈ దేశపు ప్రజాస్వామిక ప్రక్రియలను తక్కువ చేయడమేనని బిజెపి మండిపడింది. అటువంటి వ్యాఖ్యలు భారత ఎన్నికల ప్రక్రియపై బురద చిమ్మడమే కాకుండా, దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు సహకరిస్తాయంది. దేశం ఐక్యతను దెబ్బతీసే ప్రకటనలు చేయడం కంటె నిర్మాణాత్మక విమర్శలపై కాంగ్రెస్ దృష్టి సారించాలని సూచించింది.
మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సజ్జన్‌సింగ్ వర్మ ఇండోర్‌లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ‘‘కోపంగా ఉన్న ప్రజలు శ్రీలంక ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్ళారు. బంగ్లాదేశ్‌లోనూ ప్రధాని నివాసంలోకి చొరబడ్డారు. బీజేపీ తప్పుడు విధానాలు, అవినీతితో మనదేశంలోనూ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అందువల్ల మనదేశంలోనూ అలాగే జరుగుతుంది’’ అన్నారు. ‘‘నరేంద్రమోదీ, గుర్తుంచుకోండి. మీ తప్పుడు విధానాల వల్ల ఒకరోజు ప్రజలు ప్రధానమంత్రి నివాసంలోకి చొరబడతారు. అలా ఈమధ్యనే శ్రీలంకలో జరిగింది, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగింది. ఇప్పుడింక భారత్ వంతే’’ అంటూ సజ్జన్‌సింగ్ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నాయకుల వ్యాఖ్యలు భారతదేశంలో రాజకీయ విభజనలకు నిదర్శనంగా నిలిచాయి. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలూ సాధారణమే కానీ ఈ వ్యాఖ్యలు దేన్ని సంకేతిస్తున్నాయి? భారత ప్రజాస్వామిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వివాదాలు రెచ్చగొట్టి, హింసాకాండను ప్రోత్సహించే ప్రతిపక్షాల అసలు వ్యూహం ఏమిటి? అని ఆలోచిస్తే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎటువైపు దేశాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయో అర్ధమవుతుంది.