వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వక్ఫ్ చట్టం 1995లో సవరణలు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. సవరణలతో కూడిన బిల్లు ప్రతులను లోక్‌సభ ఎంపీలకు మంగళవారం సాయంత్రమే అందించారు. ఇవాళ ఆ బిల్లును లోక్‌సభలో టేబుల్ చేస్తున్నారు. అదే సమయంలో వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేయడానికి మరో బిల్లు పెడతారు. కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న, బిజెపి ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లులోని ప్రధానాంశాలు ఏమిటి?
సవరణ బిల్లు ప్రధాన లక్ష్యం వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను మతపరమైన, వితరణశీల కార్యక్రమాలకు వినియోగించడం. ఈ సవరణల్లో ప్రధానమైనది, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలోని సెక్షన్ 40ని తొలగించడం. ఆ సెక్షన్ ద్వారా, ఏ ఆస్తినైనా వక్ఫ్‌గా ప్రకటించే అధికారం బోర్డుకు ఉంటుంది. ఇప్పుడు దాన్ని మార్చి, నిర్ణయాధికారం జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.
ఇక ఈ సవరణ బిల్లులోని కొత్త ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి….
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లోనూ, రాష్ట్రాల వక్ఫ్ బోర్డులలోనూ తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి. కౌన్సిల్‌లో ఒక కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ముస్లిం సంస్థల ప్రతినిధులు, ముగ్గురు ముస్లిం లా నిపుణులు ఉండాలి. వారిలోనే ఇద్దరు మాజీ న్యాయమూర్తులు, నలుగురు దేశవ్యాప్తంగా గౌరవం కలిగిన వ్యక్తులు, కేంద్రప్రభుత్వ సీనియర్ అధికారులు ఉండాలి. వారిలో కనీసం ఇద్దరు మహిళలై ఉండాలి.
దీనికోసం, కౌన్సిల్లోనూ, బోర్డుల్లోనూ ముస్లిమేతర కేటగిరీని ఏర్పరచాలి. ఎందుకంటే మతం ఆధారంగా ఈ సంస్థల్లోకి ఎంపీలు, ప్రభుత్వ అధికారులను నామినేట్ చేయడం సాధ్యం కాదు.
కొత్త చట్టం ప్రకారం ఏదైనా ఆస్తిని వక్ఫ్‌గా రిజిస్టర్ చేసే ముందు నోటీసులు జారీ చేయడం తప్పనిసరి. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్రీకృత వెబ్‌సైట్‌లో జరగాలి.
వక్ఫ్ ఆస్తుల సర్వే అధికారం ఇకపై జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
బోర్డు నిర్ణయం తీసుకున్న 90 రోజులలోగా హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
వక్ఫ్ కౌన్సిల్ లేదా బోర్డుకు ఏదైనా స్థిర లేక చర ఆస్తిని కేవలం ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నవారు మాత్రమే, అదికూడా, ఆ ఆస్తికి చట్టపరమైన యజమాని మాత్రమే దానం చేయగలరు.
ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం కంటె ముందు దానిమీద ఏదైనా వివాదం ఉంటే, ప్రత్యేకించి అది ప్రభుత్వ ఆస్తి అయివుంటే, దాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం చెల్లదు. అలాంటి వివాదాల్లో అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి, ఆ తర్వాత రికార్డుల్లో సర్దుబాటు చేయాలి.
వక్ఫ్ బోర్డుకు అందే ధనాన్ని విధవలు, విడాకులు పొందిన మహిళలు, అనాధల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. అది కూడా ప్రభుత్వం సూచించే పద్ధతిలోనే చేయాలి.
మరో కీలకమైన ప్రతిపాదన… మహిళల వారసత్వ హక్కులు, ఆస్తివాటాలూ వారికే చెందేలా రక్షించాలి.
బోహ్రా, ఆగాఖాన్ తెగలకు ప్రత్యేక బోర్డులు ఉండాలి.
షియాలు, సున్నీలు, ముస్లిములలోని ఇతర వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం ఉండాలి.
ముస్లిం వర్గాల వ్యతిరేకతలు, అనుకూలతలు: ప్రభుత్వ వివరణ
ప్రతిపక్షాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులు ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనలపై మండిపడుతున్నాయి. వక్ప్ బోర్డులను బలహీనపరిచి, అస్థిరపరిచేందుకు అధికార బీజేపీ ఆడుతున్న నాటకమే ఈ సవరణలు అని తమిళనాడు వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు మండిపడ్డాడు. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టానికి ఎలాంటి సవరణలు చేసినా సహించేది లేదని ఆలిండయా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం మాత్రం అటువంటి ఆరోపణలను కొట్టిపడేసింది. ముస్లిం మహిళలకు, పాత చట్టంతో బాధపడిన పిల్లలకూ సాధికారత ఇవ్వడమే ఈ సవరణ ఉద్దేశమంటోంది. దేశంలోని భూములను వక్ఫ్‌బోర్డులు అక్రమంగా ఆక్రమించుకుంటుండడాన్ని నిరోధించడమే ప్రధానలక్ష్యమని వివరించింది. ఇప్పుడు దేశంలో సుమారు 8లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తిగా ఉంది, తద్వారా వక్ఫ్ బోర్డ్ దేశంలోనే మూడో అతిపెద్ద భూయజమానిగా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న రైల్వేలు, సైన్యం భారత ప్రభుత్వ అధీనంలో ఉంటే ఈ వక్ఫ్‌బోర్డులు మాత్రం ప్రైవేటు సంస్థలు.
ఈ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం తమ భూములు లాగేసుకుంటుందంటూ కొందరు ముస్లిం మతపెద్దలు ప్రమాదకరమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ బిల్లును అధ్యయనం చేయడానికి కేంద్రం ఒక జాయింట్ కమిటీ వేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అసలు, గత రెండు నెలలుగా ముస్లిం వర్గాలతో విస్తృతస్థాయి చర్చల తర్వాతే ఈ సవరణలను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆల్ ఇండియా సూఫీ సజ్జాదా నషీన్ కౌన్సిల్ ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతించింది. వక్ఫ్ బోర్డుల పనితీరును మార్చాలన్న ప్రభుత్వనిర్ణయం చాలాకాలం క్రితమే తీసుకోవలసిందని వ్యాఖ్యానించింది.