ముస్లిం ఆస్తులపై వక్ఫ్‌బోర్డులకు అపార అధికారాలను కట్టబెడుతున్న వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్రప్రభుత్వం ఒక బిల్లును తీసుకురానుంది. దానిపై పార్లమెంటులో చర్చ చేపట్టనుంది. ఆ చర్చ కోసం బిల్లు ప్రతులను ఎంపీలకు ముందుగానే అందించింది. ఆ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు నోటీసులిచ్చింది.
ఈ చర్య ద్వారా తమ పార్టీ ముస్లిములలోని ఛాందసవాదులకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వక్ఫ్‌బోర్డుకు కట్టబెట్టిన అపరిమిత అధికారాలను పరిశీలించడానికి, అవసరమైన మార్పుచేర్పులు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ నిరాకరించింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కపటధోరణి కనబరుస్తోంది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిపాదించిందన్న ప్రధాన కారణంతో కాంగ్రెస్ ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. కానీ గతంలో ఇలాంటి సవరణలనే తీసుకురావడానికి ప్రయత్నించింది. అవేంటో చూద్దాం.
దేశంలో ముస్లిముల స్థితిగతులను అధ్యయనం చేసిన సచార్ కమిటీ 2006లో చేసిన సిఫారసులకు కాంగ్రెస్ మద్దతు పలికింది. ఆ సిఫారసులను తక్షణం అమలు చేయాలంటూ బోలెడు కబుర్లు చెప్పింది. సచార్ కమిటీ తన సిఫారసుల్లో వక్ఫ్‌బోర్డులను ప్రక్షాళన చేయాలని సిఫారసు చేసింది. బోర్డులపై నియంత్రణ ఉండాలని, రికార్డుల నిర్వహణ సమర్థంగా జరగాలని, ముస్లిమేతరులైన సాంకేతిక నిపుణులను వక్ఫ్ నిర్వహణలో భాగస్వాములను చేయాలనీ సచార్ కమిటీ స్పష్టం చేసింది. అలాంటి మరిన్ని సిఫారసులను కమిటీ ఆనాటి కేంద్రప్రభుత్వానికి అందించింది.
అందరూ గుర్తించవలసిన మరో ప్రధాన విషయం ఏమంటే… 2008లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ నివేదికలో, వక్ఫ్ చట్టానికి సవరణలు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనలనే ఎన్‌డిఎ ప్రభుత్వం చేస్తోంది.
ఇప్పుడు ప్రశ్నేంటంటే సచార్ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన ప్రతిపాదనలనే ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రస్తావిస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాదు కదా. యుపిఎ హయాంలోని సచార్ కమిటీ, జెపిసిలు కూడా ముస్లిముల వ్యక్తిగత చట్టాలను తొలగించాలని కోరినప్పుడు అవి కూడా ముస్లిములపై వివక్ష చూపినట్లేనా? ఆ విషయం గురించి కాంగ్రెస్ నోరు మెదపడం లేదు.