కృష్ణాలో వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద గేట్లు ఎత్తివేశారు. తాజాగా ఆల్మట్టి డ్యాంకు 2 లక్షల 56 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, నారాయణపూర్ ప్రాజెక్టుకు 2 లక్షల 2 వేల క్యూసెక్కుల వరద విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలంకు 2 లక్షల 95 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. మరోవైపు తుంగభద్ర నుంచి 54 వేల క్యూసెక్కుల వరదను సుంకేసులకు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు (srisailam flood gates lifted ) 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ డ్యాంకు ( nagarjunasagar project ) 3 లక్షల 54 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఇప్పటికే సాగర్ పూర్తిగా నిండిపోవడంతో వరదను పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ఇప్పటికే 32 టీఎంసీలు చేసింది. 11 గేట్లు ఎత్తి 2 లక్షల 45 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 45 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. మరో నాలుగు రోజులు వరద కొనసాగే అవకాశముందని ఇంజనీర్లు చెబుతున్నారు.