సిపిఎం సీనియర్ నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 80ఏళ్ళ వయసులో కన్నుమూసారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ ఈ ఉదయం కోల్‌కతాలోని తన నివాసంలో మరణించారు. సిపిఎం పశ్చిమబెంగాల్ కార్యదర్శి మహమ్మద్ సలీం ఓ ప్రకటన ద్వారా బుద్ధదేవ్ మరణవార్తను ప్రకటించారు.
కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు సుదీర్ఘ పదవీకాలం తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య 2000-2011 మధ్య పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసారు. 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బుద్ధదేవ్, అంతకుముందు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. సిపిఎం పొలిట్‌బ్యూరోలో చాలాకాలం కీలక బాధ్యతలు వహించారు. 2011లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో వామపక్షకూటమి పరాజయం తర్వాత బుద్ధదేవ్ క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.
బుద్ధదేవ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసకోశ సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారు. కంటిచూపు కూడా మందగించింది. కోల్‌కతా బాలీగంజ్‌లోని తన నివాసంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కొడుకు ఉన్నారు.