పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన భారత మల్లయోధురాలు వినేష్ ఫొగాట్, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా వినేష్ తన నిర్ణయాన్ని వెల్లడించింది.
‘‘తల్లి లాంటి కుస్తీ నామీద గెలిచింది. నేను ఓడిపోయాను, క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ఛిద్రమైపోయాయి. ఇంతకుమించి సత్తువ నాకు లేదు. కుస్తీకి సెలవు. దేశ ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. క్షమాపణలు’’ అని ట్వీట్ చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రజ్భూషణ్ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, రోడ్లమీదకెక్కి రకరకాల వీధిపోరాటాలు చేసిన వినేష్ ఫోగాట్ మీద బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వమే కుట్రలు పన్నిందంటూ ప్రతిపక్షాలు ఈ సందర్భంగా విమర్శలు మొదలుపెట్టేసాయి. ఆ పోరాటాల్లో వినేష్‌కు అండగా నిలిచిన బజరంగ్ కూడా దీనివెనకాల ఏదో కుట్ర ఉందన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు.
‘‘వినేష్ నువ్వు ఓడిపోలేదు, ఓడించబడ్డావు. మా వరకూ నువ్వే విజేతగా ఉంటావు. నువ్వు భారత కుమార్తెవు మాత్రమే కాడు, భారతదేశపు అభిమానానివి కూడా’’ అని బజరంగ్ వ్యాఖ్యానించాడు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఎక్స్‌లో జాలి కురిపించేసాడు. ‘‘ఈ వ్యవస్థతో అలసిపోయిందా అమ్మాయి… పోరాడి పోరాడి అలసిపోయిందా అమ్మాయి’’ అని కవిత్వం ఒలకబోసాడు.
టీమ్ ఇండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దీవాలా, కోచ్, ఐవోఏ చీఫ్ పీటీ ఉష చెప్పిన ప్రకారం ఇది సపోర్టింగ్ స్టాఫ్ తప్పే అని తెలుస్తున్నది. మంగళవారం సరైన బరువే ఉన్న వినేష్, బౌట్‌కు ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది. బౌట్ సమయంలో నీళ్ళు తాగింది. బౌట్ తర్వాత కోచ్ బరువు చూస్తే చాలా ఎక్కువ ఉంది. బుధవారం ఉదయానికల్లా బరువు తగ్గించగలుగుతామని డైటీషియన్ భావించారు. నిజానికి మంగళవారం సాయంత్రం బౌట్‌కు బుధవారం వెయిట్-ఇన్‌కు మధ్య సమయం చాలా తక్కువగా ఉండింది. మంగళవారం రాత్రంతా కఠినమైన వ్యాయామాలు చేసారు. జుత్తు కత్తిరించారు. జెర్సీ కొలతలూ తగ్గించారు. ఐనా 100 గ్రాములు ఎక్కువగానే ఉన్నది. మరో గంట సేపు సమయం అడిగినా.. ఐవోసీ ఇవ్వలేదు. దీంతో వినేశ్ ఫొగట్ డిస్క్వాలిఫై అవక తప్పలేదు. అందులో వినేష్ తప్పు ఏమాత్రం లేదనీ.. బరువు నిర్వహణ పూర్తిగా సపోర్ట్ స్టాఫ్ బాధ్యతే అని డాక్టర్ దిన్షా పార్దీవాలా చెప్పారు.
అయినప్పటికీ… ప్రతిపక్షాలు, వినేష్‌తో కలిసి ఉద్యమాలు చేసిన క్రీడాకారులు అందరూ ఎన్డీయే ప్రభుత్వం ఆమెమీద కక్షకట్టి కుట్రలు పన్ని ఆమె ఓడేలా చేసిందనే అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం గుర్తించాలి.
1. పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడింది వినేష్ ఫోగాట్ ఒక్కర్తె మీదే కాదు. ఇటలీ క్రీడాకారిణి ఇమాన్యుయెలా లియుజ్జి కూడా అధిక బరువు కారణంగానే అనర్హత వేటు పడింది. కానీ ఇటలీ ప్రతిపక్షాలు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడలేదు. కుట్ర ఆరోపణలు చేయలేదు.
2. వినేష్ అంశంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేసింది ఏమీ లేదు. ఫెడరేషన్ వినేష్‌కు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. వ్యక్తిగత కోచ్, వ్యక్తిగత డైటీషియన్‌ను పెట్టుకోడానికి అనుమతినిచ్చింది.
3. తన కోచ్‌ను, తన డైటీషియన్‌ను వినేష్ స్వయంగా ఎంపిక చేసుకుంది. వినేష్ డిమాండ్‌ను, వినేష్ ఎంపికను ఫెడరేషన్ ఆమోదించింది.
4. వినేష్ ఇదే కోచ్, డైటీషియన్లను సుదీర్ఘకాలం నుంచీ కొనసాగిస్తోంది. బిష్కెక్లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ సమయంలోనూ, స్పెయిన్ గ్రాండ్-ప్రిలోనూ ఆ కోచ్, ఆ డైటీషియనే ఉన్నారు. ఆమె బరువును ఎలా మేనేజ్ చేయాలో వారికి బాగా తెలుసు.
5. వినేష్ ఫోగాట్ 50కేజీల కేటగిరీలోనే పాల్గొనక తప్పని పరిస్థితులను ఎవరూ సృష్టించలేదు. వినేష్ గతంలో 53కేజీల కేటగిరీలో పోటీచేసింది. ఈసారి కోటాలో మరో క్రీడాకారిణి ఆ కేటగిరీలో ఎంపికవడంతో తనే 50కేజీల కేటగిరీకి మారింది.
6. రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల కేటగిరీకి అర్హత సాధించడానికి ప్రయత్నించిన వినేష్, అప్పుడు కూడా బరువు తగ్గడంలో విఫలమైంది.
7. ఒలింపిక్స్ నియమాల ప్రకారం క్రీడాకారిణి గాయపడినా కూడా బరువు చూడాల్సిందే. అందువల్ల గాయం కారణంగా ఫైనల్స్ ఆడలేకపోతున్నానని చెప్పి రజత పతకాన్ని తీసుకునే అవకాశం లేదు.