బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగడంతో, భారత వీసా దరఖాస్తు కేంద్రాలు తాత్కాలికంగా మూసి వేశారు. గత మూడు వారాలుగా రిజర్వేషన్ల వ్యవహారం బంగ్లాదేశ్‌ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. బంగ్లాలో చెలరేగిన హింసలో ఇప్పటి వరకు 450 మందికిపైగా చనిపోయారు. బంగ్లాదేశ్‌తో భారత్ ఏటా 11 బిలియన్ డాలర్ల వ్యాపారం నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హై కమిషన్ కార్యాలయం,చిట్టగాంగ్, రాజ్‌షాహి,కుల్నా, షైల్‌హట్ నగరాల్లో కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిని తత్కాలికంగా మూసి వేస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరలా వాటిని ఎప్పుడు తెరిచేది, తెలియజేస్తామన్నారు.
బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు నివశిస్తున్నారు. వీరిలో 9 వేల మంది విద్యార్థులు కాగా మిగిలిన వారు వ్యాపారం నిమితం బంగ్లాదేశ్‌లో ఉంటున్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు వారిని భారత్‌కు తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు జైశంకర్ స్పష్టం చేశారు.