సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ నేడు భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో ఐదురోజుల కిందట అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో మధ్య, ఉత్తర, వాయవ్య భారతదేశంలో భారీ వర్షం కురిసింది.
తూర్పు, మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా, చత్తీస్గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. నేడు అల్పపీడనంగా మారనుంది. దీంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మోస్తరుగా కదులుతుండటంతో పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో పలుచోట్ల వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.